‘ప్రేమిస్తావా’ హీరో ఆకాశ్ మురళి..
ఆకాశ్ మురళి హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా ‘పంజా’ ఫేమ్ విష్ణువర్ధన్ ఓ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు ఆకాశ్ మురళి మాట్లాడుతూ.. “నన్ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో ప్రేమతో ఆహ్వానించడం ఆనందంగా ఉంది. మీ ప్రేమను చూస్తుంటే.. నేరుగా తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. ‘ప్రేమిస్తావా’ సినిమాకు చాలా మంచి స్పందన రావటం ఆనందంగా ఉంది. చాలా మంది ప్రేక్షకులు ఇది నా డెబ్యూ సినిమాలా అనిపించడం లేదని చెప్పడం గొప్ప ప్రశంసగా భావిస్తున్నాను.
ఇందులోని లవ్ స్టొరీ అందరూ రిలేట్ చేసుకునేలా ఉందంటూ అభినందిస్తుండటం ఇంకా ఆనందంగా ఉంది. చేజ్ సీన్స్‌ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషాన్నిచ్చింది” అన్నారు. డైరెక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ‘తెలుగులో సినిమా చాలా అద్భుతంగా రీచ్ అయ్యింది. స్క్రీన్స్ పెరుగుతున్నాయని మైత్రీ వారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. రిలేషన్స్ షిప్ నేపథ్యంలో జరిగే రొమాంటిక్ డ్రామా ఇది. పోర్చుగల్ లొకేషన్స్‌లోని సీన్స్ చాలా భారీ ఖర్చుతో తీశాం. యాక్షన్ సీన్స్ చేయడం చాలా డిఫికల్ట్. ఆకాశ్ చాలా చక్కగా నటించాడు. తనే రియల్‌గా స్టంట్స్ చేశాడు. అదితి శంకర్ అద్భుతంగా నటించింది. ఈ లవ్ జోనర్ నాకు కొత్త అనుభూతినిచ్చింది. రాబోయే సినిమా మరో కొత్త జోనర్ ట్రై చేయాలని ఉంది’ అని తెలిపారు. ‘సినిమాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది’ అని నిర్మాత స్నేహ చెప్పారు.