calender_icon.png 21 February, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలపై నిలదీయండి

19-02-2025 01:25:14 AM

  1. కాంగ్రెస్ ప్రజాపాలనలో అరిగోస
  2. ఆమనగల్లు రైతుదీక్షలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

రంగారెడ్డి/ఆమనగల్లు, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేసే ధ్యాసే మరిచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ప్రస్తుతం  ముఖ్యమంత్రి ధ్యాసంతా ఫోర్త్ సిటీ మీదే ఉందని అన్నారు.

మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మన ఇంటి దగ్గరికి వస్తే నిలదీయాలని కేటీఆర్ చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో  కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన రైతుదీక్షకు కేటీఆర్ ముఖ్యఅథిగా హాజరయ్యారు.

కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రం లో ఆరు నెలలుగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహేశ్వరం, పరిగి,చేవెళ్ల, కొడంగల్, కల్వకుర్తి ఆమనగల్లు రైతు దీక్షలకు వెళ్లానని, ఎక్కడ చూసిన ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటిదాకా ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం  కల్వకుర్తి, ఆయన అత్తగారి ఊరు ఆమనగల్లులో కూడా హామీలు నెరవేరలేదని చెప్పారు. రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులు రూ.600 కోట్లు ఉన్నాయని, పాలరైతులు బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

కులగణన పేరు చేప్పి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్  మళ్లీ మోసానికి తెరలేపుతున్నదని.. ఇప్పటికే రూ.2లక్షల రుణమాఫీ, రైతుకూలీలకు రూ.12,500, మహిళలకు రూ. 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, తులం బంగారం, రైతుబంధు, రైతుభీమా పథకాలకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళం పాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక 14 నెలల పాలనలో ఢిల్లీకి 35 సార్లు వెళ్లి 35 పైసలు కూడా తేలేదని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ జరిగిందని.. రైతులు రాజులాగా బతికారని.. 73వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాడన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 430 రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, నాగర్‌కర్నూల్ జిల్లాలో రుణమాఫీ కాక ఒక యువ రైతు చందు తన బైక్‌కు నిప్పుపెట్టారని... ఆదిలాబాద్ జిల్లాలో జాదవరావు, మేడ్చల్ జిల్లాలో సురేందర్‌రెడ్డి ఇలా రుణమాఫీ కాలేదని తీవ్ర ఆవేదనకు గురై బ్యాంకులోనే సుసైడ్ చేసుకొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా, పలువురు పార్టీ కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డుపడుతూ సీఎం ... సీఎం అంటూ నినాదాలు చేయగా ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆమనగల్లు పట్టణంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు సురభీవాణీదేవి, నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాల్కసుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.