calender_icon.png 7 October, 2024 | 4:07 AM

చెన్నై ఎయిర్‌షోలో తొక్కిసలాట

07-10-2024 01:36:10 AM

మెరీనా బీచ్‌లో ఊపిరాడక ఐదుగురి మృతి

మరో 230 మందికి తీవ్ర అస్వస్థత

ప్రదర్శనకు పోటెత్తిన 15 లక్షల మంది

చెన్నై, అక్టోబర్ 6: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్‌షోలో విషాదం చోటు చేసుకుంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) ఆదివారం నిర్వహించిన మెగా ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది మంది సందర్శకులు పోటెత్తారు. ప్రదర్శన ముగిశాక తిరుగు ప్రయాణంలో తీవ్రమైన రద్దీ నెలకొంది.

దీంతో మెరీనా బీచ్ రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ఉక్కపోత, ఎండ తాళలేక నలుగురు సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోగా, మరొకరు గుండెపోటుతో మృతి చెందారు.

అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని మూడు ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్‌బాబు, దినేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఎయిర్‌షోకు 15 లక్షల మందికిపైగా ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో జనం రావడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సాయంత్రం వరకూ ట్రాఫిక్ జామ్

ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకే ఎయిర్‌షో ముగిసినప్పటికీ సాయంత్రం వరకు సమీప రహదారుల్లో ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలిం చేందుకూ ఇబ్బంది ఎదురైంది. చెన్నై నగరవాసులే కాకుండా సమీప ప్రాంతాల నుంచి భారీగా రావడంతో బీచ్‌లోని లైట్‌హౌస్ మె ట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు.

షో ముగిసిన తర్వాత తిరుగుప్రయాణం కోసం లక్షల మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. అన్నా స్కేర్‌లోని బస్టాండ్ కూడా సందర్శకుల తాకిడితో కిక్కిరిసిపోయింది. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఈ ఎయిర్‌షోను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వెలుపల ఈ ప్రదర్శన నిర్వహించడం ఇది మూడోసారి.