calender_icon.png 28 October, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట

28-10-2024 12:00:00 AM

  1. తొమ్మిది మందికి గాయాలు
  2. రైలు ఎక్కేందుకు పోటీ పడటంతో ఘటన

ముంబై, అక్టోబర్ 27: ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని బాబా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఉదయం 5.56 గంటలకు గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడటంతో ఈ ఘటన జరిగింది. దీపావళి, ఛత్‌పూజ ఉండటం వల్ల సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో బాంద్రా స్టేషన్ కిక్కిరిసిపోయింది.

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి రాగానే అన్‌రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఓ బాధితుడు కింద పడిపోయినా మిగతావారు అతని మీద నుంచి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. 

కేంద్రంపై శివసేన విమర్శలు 

ఈ ప్రమాదం దేశానికి సిగ్గు చేటు అని, అసమర్థ మంత్రుల చేతుల్లో ప్రభుత్వం ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఉద్దేశించి శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే తీవ్రంగా విమర్శించారు. రైల్వే భద్రతను నిర్వహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

రీల్ మంత్రి రైల్ మంత్రిగా మారితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని మండిపడ్డారు. రైల్వే మంత్రిగా వైష్ణవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 25కుపైగా పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయని ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.