calender_icon.png 15 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

12-11-2024 12:52:21 AM

సీసీఐకి వ్యతిరేకంగా ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల మూసివేత

కొనుగోళ్లు చేపట్టాలని రైతుల ఆందోళనలు 

స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

మంత్రి చెప్పినా కొన్ని చోట్ల తెరుచోని మిల్లులు

రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండి 

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, నవంబర్ 11: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యంగా ప్రారంభమైన పత్తి కొనుగోళ్లలో ఆరంభం నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత తేమ శాతం విషయంలో పత్తి రైతులు ఇబ్బంది పడగా, తాజాగా కేంద్ర ప్రభుత సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లు నిలిపివేశారు. సీసీఐ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 పేరుతో కొనుగోళ్లు విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించింది. పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్, జాబ్ వర్క్‌లను సీసీఐ సంస్థ మూడు కేటగిరీలుగా విభజించింది. దీంతో కొన్ని జిన్నింగ్‌లకే పత్తి కొనుగోలు చేపట్టే నిబంధన ఉండటంతో సీసీఐ తీరును తప్పుపడుతూ కొనుగోళ్లను నిలిపివేయాలని య జమానులు నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళనలు చేశారు. 

 సీసీఐ సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ సమ్మె నేపథ్యంలో సీసీఐ సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారు. సమ్మె కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించి, పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు కొన్ని జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. 

కొనుగోళ్లు ప్రారంభమైన కేంద్రాలు

ఆదిలాబాద్‌లో గంటల తరబడి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు రైతు సంఘాల నాయకులు మద్దతు పలకడంతో మార్కెట్ యార్డ్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికారులు మళ్లీ కొనుగోళ్లను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా భైంసాలోనూ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మల్ జాతీయ రహదారిపై రైతు లు రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కె ట్ కమిటీ అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు మార్కెటింగ్‌శాఖ అధికారులు, వ్యాపారులతో మాట్లాడి కొనుగోళ్లను పునరుద్ధరిం చారు. ఖమ్మం మార్కెట్‌లోని వ్యాపారులు కూడా మధ్యా హ్నం వరకు కొనుగోళ్లు చేయకుండా బంద్ చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించారు. 

ఇంకా కొనుగోళ్లు లేవ్..

కామారెడ్డి జిల్లాలోని 9 జిన్నింగ్ మిల్లులతో పాటు ప్రభుత్వ జిన్నింగ్ మిల్లు లో కూడా కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం నీలంనగర్ వద్ద ఉన్న ఎస్‌వీఎస్ కాటన్ మిల్లుకు పరిసర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పత్తి విక్రయించేందుకు ట్రాక్టర్‌లు, ఆటోలలో తీసుకవచ్చారు. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఆగ్రహించి మిల్లు ఎదుట రహదారిపై భైఠాయించారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు, అధికారులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమిం చారు. అయి నా కూడా కొనుగోళ్లు చేపట్టలేదు. వరంగల్  ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ కార్యదర్శి నిర్మల వ్యాపారులతో చర్చలు జరిపినా కొనుగోళ్లు తిరిగి ప్రారంభంకాలేదు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది: హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ర్ట వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎక్స్‌వేదికగా ఆయన స్పందించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన రైతులకు కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారిందన్నారు.

పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని మండిపడ్డారు. సీసీఐ, రాష్ర్ట ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ర్ట జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం ఎందుకు లేదని ప్రశ్నించారు. 

కిషన్‌రెడ్డి చొరవతో తొలగిన ప్రతిష్టంభన

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో రాష్ర్టంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో మాట్లాడి, రైతులను ఆదుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. సానుకూలంగా స్పందించిన జౌళి శాఖ మంత్రి తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐని ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి.

పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నిబంధనలనే ఈ ఏడాదీ పాటించనుంది. ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయనుంది.