18-04-2025 12:00:00 AM
గవర్నర్ అధికారాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలానే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందనడంలో సందేహం లేదు. గవర్నర్ ఆమోదం తెలపనప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన దగ్గర పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసింది.
దీంతో గవర్నర్ అధికార దుర్వినియోగంపై స్టాలిన్ ప్రభుత్వం చారిత్రక విజయం సాధించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇదే ఊపుతో రాష్ట్రల స్వయంప్రతిపత్తి కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిద్వారా రాష్ట్రాలపై కేంద్ర అజమాయిషీని సవాల్ చేసింది. ఏప్రిల్ 15న తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ‘రాజ్యాంగం ప్రకారమే కేంద్ర, రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.
ఇక్కడ ఎవరూ ఎవరికీ సబార్డినేట్ కాదు’ అని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ, ఎన్‌పీఈ2020, నీట్ వంటి పాలసీల ద్వారా రాష్ట్రాలను బలహీన పరుస్తుందన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న చాలా అంశాలపై కేంద్రమే పెత్తనం చెలాయిస్తుందన్నారు.
గతంలో రాష్ట్ర జాబితాలో ఉండి ఉమ్మడి జాబితాలోకి వెళ్లిన అంశాలను తిరిగి రాష్ట్ర జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను స్టాలిన్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇందులో భాగంగానే ‘రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతోపాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపర్చడం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అని స్టాలిన్ ప్రకటించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌కు కమిటీ సారథ్య బాధ్యతలు అప్పగించి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, తమిళనాడు ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ నాగనాథన్‌ను సభ్యులుగా నియమించారు. కేంద్ర మధ్య సంబంధాలకు సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలు, విధానాలను సమీక్షించడం, రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి వెళ్లిన అంశాలను పునరుద్ధరించడానికి గల మార్గాలను సిఫార్సు చేయడం, దేశ ఐక్యత, సమగ్రతల విషయంలో రాజీ పడకుండానే రాష్ట్రాలకు గరిష్ఠంగా స్వయంప్రతిపత్తిని కల్పించే సంస్కరణలను ఈ కమిటీ సూచించనుంది.
రెండేళ్లలో పూర్తిస్థాయి సమగ్ర నివేదికను ప్రభుత్వం చేతిలో పెడుతుంది. మధ్యంతర నివేదిక 2026 జనవరి నాటికి స్టాలిన్ ప్రభుత్వం చేతిలో ఉండనుండటంతో అదే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంప్రతిపత్తి అంశాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మల్చుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం లేకపోలేదు.
జీఎస్‌టీతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, త్రిభాషా విధానం, నీట్ వంటి అంశాలను లేవనెత్తి వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను స్టాలిన్ ఇరుకునపెట్టే అకాశాలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై తమిళనాడు ప్రభుత్వ ఆందోళన కొత్తదేమీ కాదు. 1969లోనే అప్పటి ప్రభుత్వం రాజమన్నార్ కమిషన్ ఏర్పాటు చేసింది. జయలలిత వంటి నేతలుకూడా తమ హయాంలో ఆందోళనలు వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం ఏర్పడింది.