calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు సిబ్బంది కొరత!

28-10-2024 02:11:25 AM

  1. గణాంక శాఖలో పాత జిల్లాల ప్రకారమే పోస్టులు
  2. ఒక్కో అధికారికి అదనంగా మూడు మండలాల బాధ్యతలు 
  3. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పెరగని నియామకాలు
  4. 80వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వేకు ప్రభుత్వం సన్నద్ధం
  5. ఇప్పుడు గణాంక శాఖలో ఉన్నది 1080 ఉద్యోగులు

హైదరాబాద్, అక్టోబర్ 27(విజయక్రాంతి): కులగణన.. తెలంగాణ ప్రభు త్వానికి ఇది ఇప్పుడు ఛాలెంజింగ్ అంశం. ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ఈ కులగణన ప్రక్రియకు సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారింది.

అర్థ గణాంక విభాగం లోని అరకొరగా ఉన్న ఉద్యోగులతో  సర్వే నిర్వహించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పా లి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగించింది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని గణాంక విభాగానికి సర్వేలు చేయడంలో విశేష అనుభవం ఉంది.

గణాంక శాఖ ఏడాదికి దాదాపు 38 రకాల సర్వేలను చేస్తుంది. ఇప్పుడు ఆ విభాగం ఆధ్వర్యంలోనే కులగణన జరగబోతోంది. సర్వేను ఎలా చేయాలి? ప్రజల వివరాలను తెలుసుకునేందుకు ఏయే అంశాలను జాబితా లో ఉంచాలి? గ్రామ, మండల, జిల్లాలో స్థాయిలోని ఉద్యోగులు సర్వేను ఎలా చేయాలి? వివరాలను ఎలా నమోదు చేయాలో తెలిపేందుకు శిక్షణ తరగతుల నిర్వహణ, సర్వే జరుగుతున్నన్ని రోజులపాటు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లుకు వచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయ డం, సమస్యను పరిష్కరించే బాధ్యత అర్థ గణాంక విభాగానిదే.

రాష్టంలో ప్రభుత్వం నియమించిన 80వేల మంది ఎన్యుమరేటర్లను ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. అంతటి ప్రధానమైన ఈ గణాంక డిపార్ట్‌మెంట్‌ను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

2016 తర్వాత కొత్త పోస్టులు లేవు..

గణాంక శాఖ పరిధిలో ప్రస్తుతం  రాష్ట్రవ్యాప్తంగా 1,080 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 2016లో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో మండల, జిల్లాల్లో కొత్త పోస్టులను ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. కానీ నాటి ప్రభుత్వం కొత్త పోస్టులను ఏర్పాటు చేయలేదు.

మధ్యలో నియామకాలు   చేపట్టినా.. వాటిని కొత్త మండలాలు, జిల్లాల ప్రాతిపాదికన చేపట్టలేదు. దీనివల్ల మండలంలో పనిచేస్తున్న ఒక ప్లానింగ్ అండ్ స్టాటస్టికల్ ఆఫీసర్ అదనంగా మూడు మండలాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీంతో మండలస్థాయిలోని అధికారులు తీవ్రమైన పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. 

సీఎం వద్ద నియామకం ఫైల్..

గణాంక శాఖలో నియామకాలు చేపట్టాలని కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడిన తర్వాత నాటి బీఆర్‌ఎస్ సర్కారుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ సర్కారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎం వద్ద ఉన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

ఆ 150 పోస్టులను భర్తీ చేసినట్లయితే వేడినీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న అర్థ గణాంక శాఖకు ఈ కులగణన వేళ కొంత ఊరట లభించే అవకాశం ఉండేది. అటు ఉద్యోగులను భర్తీ చేయకుండా, అరకొర సిబ్బందితో ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 

సకాలంలో అయ్యేనా?

కులగణన కోసం క్లాజ్‌లు, సబ్ క్లాజులు కలిపి 75అంశాలతో ప్రణాళిక శాఖ ఫార్మాట్‌ను తయారు చేసింది. ఒక కుటుంబానికి ఈ 75 క్లాజులను నింపాలంటే.. ఒక ఎన్యుమరేటర్‌కు కనీసం గంట సమయం పడు తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం లో 1.20 కోట్ల కుటుంబాలు ఉంటాయన్న అంచనాతో 80వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే చేయాలని  ప్రభుత్వం భావించి నట్లు తెలుస్తోంది.

అయితే కుటుంబాల సంఖ్య 1.20 కోట్లకు మించి ఉండే అవకాశం ఉన్నట్లు గణాంక శాఖ అధికారులు భావిస్తున్నారు. గ్రామాలు, రిమోట్ ఏరియాల్లోని ప్రజలు వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో అధికారులు వచ్చినప్పుడు కుటుంబసభ్యులు ఉండకపోతే ఒక గ్రామంలో సర్వేను పూర్తి చేయాలనుకున్న నిర్ణీత సమయం పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా కుటుంబాల సంఖ్య ప్రభుత్వం అనుకున్నదానికంటే ఎక్కువ ఉంటే.. సర్వే చేసే రోజులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, రాష్ట్రంలో గణాంక శాఖలో 1,080 మంది ఉద్యోగులు ఉన్నారు. 80వేల ఎన్యుమరేటర్లకు వీరే సర్వేకు సంబంధించిన సూచనలు చేయాల్సి ఉంటుంది.

అంటే ఒక గణాంక శాఖ ఉద్యోగి దాదాపు 80మంది ఎన్యుమరేటర్లను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో సదరు ఉద్యోగిపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సర్వే ప్రభుత్వం అనుకున్న నవంబర్ 30లోపు పూర్తవుతుందా? లేక గడువు పెరుగుతుందా? అనేది వేచి చూడాలి.

కాంగ్రెస్‌కు చాలా కీలకం 

కులగణన అనేది కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో ఎన్నికల నినాదం. తెలంగాణలో సమర్థవంతంగా కులగణన చేసి.. దీన్ని ఒక నమూనాగా చూపించి.. జాతీయస్థాయిలో ఎన్నికల ప్రచారాస్త్రంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ సర్వేలోని ప్రతి అప్డేట్‌ను ఏఐసీసీ నిత్యం పర్యవేక్షిస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ఢిల్లీకి వెళ్లి కులగణనకు సంబంధించిన ప్రశ్నావళి, సర్వే వివరాలను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీకి వివరించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వేను జాతీయస్థాయిలో నమూనాగా చూపించాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ మంది సిబ్బందితో నిర్వహించడం పెద్ద సవాలే అని చెప్పాలి.