calender_icon.png 15 January, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

08-07-2024 04:22:49 AM

  • వారం క్రితం పురుగుల మందు తాగిన ఎస్సై 
  • సీఐ, సిబ్బంది వేదిస్తున్నారని వాంగ్మూలం 
  • చికిత్స పొందుతూ మృతి 
  • ఎస్సై మృతదేహంతో స్వగ్రామంలో రాస్తారోకో 
  • ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ 
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంఘీభావం

హనుమకొండ/అశ్వారావుపేట, జూలై 7 (విజయక్రాంతి): పోలీస్‌శాఖలో పెనువిషాదం చోటు చేసుకొంది. అధికారుల వేదింపులు తాళలేక గత నెల 30న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందుతాగిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్(38) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతదేహాన్ని ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు తరలించారు. 2014 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం 3వ పట్టణ స్టేషన్, చుంచుపల్లి, మణుగూరు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఆరు నెలల క్రితం అశ్వారావుపేట ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.

ఆనాటి నుంచే సీఐ జితేందర్‌రెడ్డి, మరో నలుగురు సిబ్బంది అతడికి సరై న సహాయ సహకారాలు అందించకుం డా, అవమనాలకు గురిచేశారని ఎస్సై తన మ రణ వాగ్మూలంలో తెలిపారు. దీంతో సీఐ జితేందర్‌రెడ్డితోపాటు మరో నలుగురిపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. అశ్వారావుపేటలో దళితసంఘాల నేతలు, సీపీఐ, బీఆర్‌ఎస్ నాయకులు రస్తారోకో నిర్వహించారు. ఎస్సై మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఇన్‌చార్జి సీఐ కరుణాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఎస్సై మృతదేహంతో రాస్తారోకో   

సీఐ, స్టేషన్ సిబ్బంది వేదింపుల కారణంగానే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఎస్సై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వరంగల్ జిల్లా దుగ్గొండి నల్లబెల్లి మండలం నారక్కపేట 365 జాతీయ రహదారిపై ఆదివారం ఎస్సై మృతదేహంతో రాస్తారోకో చేశారు. సీఐ జితేందర్‌రెడ్డిని సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఏసీపీ కిరణ్‌కుమార్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనలో నల్లబెల్లి మాజీ జెడ్పీటీసీ పెద్ది స్వప్న, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, సారంగపాణి, దళిత సంఘాల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

ప్రభుత్వమే బాధ్యత వహించాలి: పెద్ది

ప్రభుత్వ పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేదింపులకు బలైన శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రాస్తారోకోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎస్సై కుటుంబానికి కోటి రూపాయల తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ భార్యకు గ్రూప్ ఉద్యోగం కల్పించడంతో పాటు 5 ఎకరాల భూమి, రాజీవ్ గృహం నిర్మించి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీనివాస్ మృతి అని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.