- నిరవధిక దీక్షలకు ముగింపు పలకాలి
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): సుమారు నెల రోజుల నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపి సమ్మెకు ముగింపు పలకాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు ఎస్‌ఎస్‌ఏ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా, వారికి కనీస వేతనాలు అందడం లేదని వాపోయారు.
కనీసం హెల్త్ కార్డులకైనా నోచుకోలేదని, ఉద్యోగులు చనిపోతే కనీసం ఆర్థిక సాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిందని, పార్టీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన ఎందుకు హామీ నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
ఉద్యోగాలు రెగ్యులరైజ్ సాధ్యం కాని పక్షంలో, తమ కేడర్ ఆధారంగా పే స్కేల్, రూ.10 లక్షల బీమా వసతి కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారన్నారు. కనీసం ఆ డిమాండ్‌నైనా నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి కోరారు. అలాగే పదవీ విరమణ తర్వాత రూ.25 లక్షల బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎస్‌ఏ అమలులో కేంద్ర 60 శాతం నిధులు మంజూరు చేస్తోందని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతాన్ని సక్రమంగా విడుదల చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు అమలయ్యేదాకా రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామ న్నారు. బీజేపీ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరవధిక దీక్షలకు మద్దతు తెలుపుతుందనని తెలిపారు.