21-03-2025 12:00:00 AM
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్‌ను తాజాగా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ పర్వత ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం వరకూ జరిగింది. మూవీ టీమ్ అంతా లొకేషన్ నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. షూటింగ్ పూర్తయ్యాక స్థానిక ప్రజలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు వచ్చి రాజమౌళి, మహేశ్‌లతో ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి ఒడిశాలోని ఒక పర్వతానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒడిశాలోని అత్యంత ఎత్తున, అద్భుతమైన శిఖరం డియోమాలికి ట్రెక్కింగ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. “ఒడిశాలోని అత్యంత ఎత్తున అద్భుతమైన పర్వతం డియోమాలికి ట్రెక్కింగ్‌కి వెళ్లా. పై నుంచి వ్యూ అత్యద్భుతంగా ఉంది. కానీ పర్వతంపై ఉన్న చెత్తాచెదారం చూశాక మనసు ఆవేదనకు గురైంది. ఇటువంటి సహజమైన, అద్భుతమైన ప్రాంతాలను బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడూ బాధ్యతగా తీసుకోవాలి. ఇలాంటి అందమైన ప్రాంతాలను కాపాడుకోవడంలో సహకరించాలి. వ్యర్థాలను ఇక్కడ పడేయకుండా మీతో తీసుకెళ్లండి” అని రాజమౌళి సూచించారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.