కన్నులపండువగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగోరోజు సోమవారం రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి ఊరేగారు. కాళీయ మర్దనం అవతారంలో భక్తులకు దర్శనమించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
తిరుమల మాడవీధుల భక్తులతో కిటకిటలాడాయి. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుఢ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు.
అంతర్గత రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డులో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. మంగళవారం గరుడ వాహనంపై భక్తులకు స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో తిరుమల కొండపైకి వాహనాలు రావడానికి వీలు లేదని పేర్కొన్నారు. గరుడ సేవకు ఆర్టీసీ 400లకు పైగా బస్సులు ఏర్పాటు చేసిందని, 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.