- భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఏఐ వినియోగం
- ‘శ్రీనివాస సేతు’ ఇక గరుడ వారధి
- టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపికబురు అందించింది. ఇకపై భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటలకు గంటలు వేచి ఉండే ఇబ్బంది లేకుండా, క్యూలైన్ల పర్యవేక్షణకు కృత్రిమ మేధను వినియోగించి కేవలం 2 3 గంటల్లోనే స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ధర్మకర్తల మండలి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నది. టీటీడీ పరిధిలో అన్యమత ఉద్యోగులను వేరేచోటికి పంపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నది. తిరుమలలోని డంపింగ్ యార్డుల్లో పేరుకున్న చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో తరలిస్తామని స్పష్టం చేసింది.
ముఖ్య నిర్ణయాలు ఇవే..
* తిరుపతిలోని ‘శ్రీనివాస సేతు’ ఇక గరుడ వారధిగా పేరు మార్పు
* అలిపిరిలో దేవలోక్ ప్రాజెక్ట్‌కు టూరిజం కార్పొరేషన్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీ వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు
* తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు
* తిరుపతివాసులకు ప్రతి మంగళవారం స్వామివారి శీఘ్రదర్శనం
* శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాల పరిశీలన
* ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు వెనక్కి.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్
* నిత్యాన్న ప్రసాద మెనూలో మరో పదార్థం చేరిక
* టూరిజం కార్పొరేషన్ల శీఘ్ర దర్శన కోటా రద్దు
* శారద పీఠం మఠం నిర్మాణంలో అక్రమాల నేపథ్యంలో భవనం లీజు రద్దు
* బ్రహ్మోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగుల నగదు ప్రోత్సాహకం 10శాతం పెంపు
* ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంవోయూ