19-04-2025 01:35:59 AM
ప్లంజ్‌పూల్ డేంజర్!
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరద ఉధృతి కార ణంగా 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఊహించని విధంగా నష్టం జరిగింది. డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. జలాలు కిందకు వదలడంతో దిగువన ఉన్న మెజార్టీ ప్లంజ్‌పూల్ దెబ్బతిన్నది.
ప్లంజ్‌పూల్ దెబ్బతిన్న ప్రాంతం డ్యాం పునా దుల కంటే లోతుగా ఉందని ఫలితంగా డ్యాం భద్రతకే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులు ఏపీ ప్రభుత్వానికి నివేదించారు. నిధుల కొరత కారణంగా తాము మరమ్మతులు చేయించలేమంటూ ఏపీ సర్కార్ చేతులు దులుపుకోవడం గమనార్హం.
కేంద్రానికి ఎన్డీఎస్‌ఏ నివేదిక..
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టును నిర్వహించే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి అప్పగించగా... నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. డ్యాం నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం మరమ్మతులు చేయించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
అంత ఖర్చు తాము భరించలేమని కేంద్రమే సాయం చేయాలని కోరి చేతులు దులుపుకొన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి శాఖ ముందుకు వచ్చి అసలు శ్రీశైలం ప్రాజెక్టు తాజా పరిస్థితి ఏంటో తేల్చాలంటూ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)ను ఆదేశించింది. మరమ్మతుల బాధ్యతలు కూడా తీసుకునేందుకు ఎన్డీఎస్‌ఏ ముందుకువచ్చింది.
ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలోని నిపుణుల బృందం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించేందుకు ఈ నెల చివర్లో రాష్ట్రానికి రానున్నది. బృందం ఏప్రిల్ 28న విజయవాడలో రాష్ర్ట జలవనరుల శాఖ అధికారులతో సమావేశం కానున్నది. మరుసటి రోజు శ్రీశైలం వద్దకు వెళ్లి డ్యాం ప్లంజ్ పూల్‌ను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయనుంది.
శ్రీశైలం ప్రాజెక్టు రక్షణ అంశం ఇప్పటికే కృష్ణా నదీ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తోందని పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రాష్ట్రఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాయం కోరింది. దీనిపై కేంద్రం ముందుగా పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) బృందాన్ని పరిశీలనకు పంపింది. బృందం ఒక నివేదిక సిద్ధం చేసి జలశక్తి మంత్రిత్వశాఖకు సమర్పించింది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీఎస్‌ఏను నియమించింది.
అసలు సమస్య ఏమిటంటే..
19 లక్షల క్యూసెక్కుల వరద (డిశ్చార్జి) తాకిడిని తట్టుకునేలా శ్రీశైలం డ్యాం నిర్మాణం జరిగింది. 2009 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 25.5 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి చేరింది. ఇదే ఉధృతి సుమారు 78 గంటల పాటు కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, నాడు నీటిమట్టం 273.8 మీటర్లకు చేరుకుంది. ఒకదశలో ఎప్పుడు ఏ ఉపద్రవం జరుగుతుందోనన్న ఆందోళన ఇరిగేషన్‌శాఖలో మొదలైంది.
సకాలంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. కిందికి దుంకి వచ్చిన జలాల కారణంగా కింద ప్లంజ్ పూల్ తీవ్రంగా ధ్వంసమైంది. 2020లో ఏపీ పాండ్యా నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టును పరిశీలించి తక్షణ మరమ్మతులు చేయాలని సూచించింది. 120 మీటర్ల లోతు, 400 మీటర్ల పొడవు, 270 మీటర్ల వెడల్పులో ప్లంజ్‌పూల్‌కు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించారు.
సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) కూడా ప్రాజెక్టును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిందేనని సూచించింది. ఇందుకు సుమారు రూ. 500 కోట్ల వరకు ఖర్చు అవుతాయని నిపుణులు అంచనా వేశారు. నాటి ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మరమ్మతులు చేయించాలని ప్రణాళికలు సైతం రూపొందించింది.
తర్వాత ఏమైందో తెలియదు గానీ.. తర్వాత ప్రభుత్వం దానికి గురించి పట్టించుకోనే లేదు. చివరకు కొంతకాలం క్రితం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పందించింది. మరమ్మతులకయ్యే స్వయంగా ఖర్చును భరిస్తామని తెలుపుతూ... ఎన్డీఎస్‌ఏను పనులు చేపట్టాలని ఆదేశించింది.
ఏపీ జల దోపిడీ..
మొదట కేవలం జల విద్యుత్ కోసమే ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ఇక్కడి నుంచి మద్రాస్ తాగునీటి అవసరాల కోసం నాటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద హెడ్‌రెగ్యులేటరీ ఏర్పాటు చేసి జలాలు తరలించింది. డ్యాం ఎడమ వైపు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలతోపాటు తాగునీటి అవసరాలకు జలాల కేటాయింపు జరిగింది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కేంద్రం ఇప్పటివరకు రెండు రాష్ట్రాల వాటాలను తేల్చలేదు.
ప్రస్తుతం ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కేఆర్‌ఎంబీనే రెండు రాష్ట్రాలకు జలాల కేటాయింపు నిర్ణయాలు తీసుకుంటున్నది. దీన్ని అదునుగా తీసుకుని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఇప్పటికే కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నది. పైగా హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం పేరుతో అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణానికి పూనుకున్నది.
మరమ్మతులు చేయకుంటే డేంజర్..
వర్షాలు దండిగా కురిసి, వరద ఉధృతికి డ్యాం జలాశయం పూర్తిగా నిండినప్పుడు ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై జలాలను దిగువకు విడుదల చేస్తారు. ఆ సమయంలో అత్యంత వేగంగా జలాలు కిందికి దుంకి, డ్యాం కింద పెద్దగా గుంతలు పడే అవకాశం ఉంటుంది. వాటిని తట్టుకునేందుకు కింద ప్లంజ్ పూల్ నిర్మాణం ఉంటుంది.
జలాల ఉధృతికి కింద ప్లంజ్ పూల్‌లో గుంతలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇరిగేషన్‌శాఖ ఎప్పటికప్పుడు ప్లంజ్ పూల్స్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అవసరమైతే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలి. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం కింద ప్లంజ్‌పూల్‌కు ప్రమాదం ఏర్పడి 16 ఏళ్లవుతున్నది. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, దాని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
విద్యుత్ అవసరాల కోసం
ఉమ్మడి ఏపీలో నాటి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కృష్ణా నదిపై భారీ డ్యాం నిర్మించాలని నిర్ణయించింది. అందుకు మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఉన్న శ్రీశైలం ప్రాంతాన్ని ఎంచుకున్నది. 1981లో డ్యాం పనులు ప్రారంభమయ్యాయి.
రూ.470 కోట్లతో డ్యాం పనులు పూర్తయ్యాయి. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. డ్యాం పొడవు 512 మీటర్లు. ఎత్తు 145.10 మీటర్లు. ఇక్కడ 6X150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎడమ గట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంతో పాటు 7x110 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రైట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్టులున్నాయి.