03-03-2025 12:00:00 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 2 (విజయక్రాంతి) : మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు విలువలు గల నాయకుడని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ కొనియాడారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్’తో పాటూ ముఖ్య అధికారులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ దుద్ధిల్ల శ్రీపాదరావు ప్రజలకు సేవ చేస్తూ, రాజకీయ జీవితంలో అపారమైన కీర్తి పొందారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అసెంబ్లీలో స్పీకర్‌గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు.
రాజకీయరంగంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, నేటితరం యువతీ, యువకులకు ఆయన మార్గదర్శి అని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని శ్రీపాదరావు సేవలను స్మరించుకొని, ఘనంగా నివాళులర్పించారు.