calender_icon.png 4 October, 2024 | 8:47 AM

స్త్రీనిధి రుణాల చెల్లింపులో చేతివాటం

04-10-2024 12:39:56 AM

  1. మెదక్ జిల్లాలో 85 లక్షలు పక్కదారి
  2. సోషల్ ఆడిట్‌లో వెలుగులోకి వీవోఏల బాగోతం

మెదక్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును తమ సొంతానికి వాడుకుంటూ కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏకంగా మహిళా సంఘాలకు కేటాయించిన స్త్రీనిధి రుణాలలో రూ.85 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన ఉదంతం మెదక్ జిల్లాలో జరిగింది.

ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రికవరీ చేయిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకొంటు న్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు అందిస్తోంది.

ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకం పక్కదారి పడుతోంది. బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలతో పాటు స్త్రీనిధి రుణాలను ప్రతి మహిళకు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు అందిస్తున్నారు. మహిళలు తిరిగి నెలనెలా కొంత అసలుతో పాటు వడ్డీ డబ్బులను విలేజ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ(వీవోఏ)లకు చెల్లిస్తూ బుక్‌లో రాయిస్తారు.

అయితే, ఇటీవల స్త్రీనిధి రుణాల అందజేత, చెల్లింపులపై జిల్లాలోని పలు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించగా కొంతమంది వీవోఏలు స్త్రీనిధి రుణాల డబ్బులను తిరిగి బ్యాంకుల్లో చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్లు తేలింది. 

లెక్కలోకి రాని రూ.85 లక్షలు 

మెదక్ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా స్త్రీనిధి ద్వారా ఈ సం వత్సరం రూ.78 కోట్ల రుణాలు అందజేశారు. సుమారు 8,600 మంది మహి ళా సంఘాల సభ్యులు (ఎస్‌హెచ్‌జీలు) రుణాలు తీసుకున్నారు. వీరంతా వడ్డీతో పాటు కొం త అసలు కలిపి వీవోఏలకు చెల్లించడం పరిపాటి. ఇదేవిధంగా గతంలోనూ రుణాలు మంజూరయ్యాయి.

ఇదే అదనుగా కొందరు వీవోఏలు చేతివాటం చూపిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం నిర్వహించే ఆడిట్‌లో సీఏల బాగోతం బయట పడుతున్నా అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

కాగా, ఈ వ్యవహారంలో కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారి నుంచి డబ్బులు రికవరీ చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయి తే, స్త్రీనిధి ద్వారా పొందిన రుణాలలో ఎస్‌హెచ్‌జీలు రూ.166 కోట్లు కట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం సోషల్ ఆడిట్‌లో నాలుగేళ్లకు సంబంధించి రూ.85 లక్షల గోల్‌మాల్ మాత్రమే బయటపడింది. అధికారులు మరింత విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. 

రికవరీ చేస్తున్నాం

స్త్రీనిధి రుణాల్లో సొంతానికి డబ్బులు వాడుకున్న వీవోఏల నుంచి రికవరీ చేస్తున్నాం. జిల్లాలో సుమారు రూ.85 లక్షలు పక్కదారి పట్టినట్లు సోషల్ ఆడిట్ ద్వారా తెలిసింది. బాధ్యులకు నోటీసులు జారీ చేసి గడువు విధించి సుమారు రూ.30 లక్షల వరకు రికవరీ చేశాం. మిగతా డబ్బును త్వరలోనే రికవరీ చేస్తాం. ఒకవేళ డబ్బులు చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని పర్మినెంట్‌గా ఉద్యోగం నుంచి తొలగిస్తాం. 

 గంగారాం, స్త్రీనిధి జిల్లా మేనేజర్, మెదక్