calender_icon.png 9 October, 2024 | 7:47 PM

ఎస్బీఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు శెట్టి

29-08-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 28: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్‌గా గద్వాలవాసి చల్లా శ్రీనివాసులు శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం పనిగంటలు ముగిసిన తర్వాత పదవీ విరమణ చేసిన దినేశ్ ఖారా స్థానంలో శెట్టి వచ్చారని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  59 ఏండ్ల శెట్టి బ్యాంక్‌లో ఇప్పటివరకూ అత్యంత సీనియర్ అయిన మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు. ఎస్బీఐ సర్వీసులో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ల నుంచి చైర్మన్ పదవికి శ్రీనివాసు లు శెట్టిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ)  ఎంపిక చేసింది.

తదుపరి కేంద్ర ప్రభుత్వం ఆయ న నియామకానికి ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో గద్వాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన శెట్టి అగ్రికల్చర్ బీఎస్‌ఈ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఇండియ న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్ కూడా. 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభిం చి మూడు దశాబ్దాలుగా కార్పొరేట్ క్రెడి ట్, రిటైల్, డిజిటల్ ఇంటర్నేషనల్ బ్యాం కింగ్ (న్యూయార్క్) తదితర విభాగాల్లో అపార అనుభవం గడించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీల్లో కూడా ఆయన సభ్యుడిగా కొనసాగారు.

విలువైన సంస్థగా రూపొందిస్తాం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా రూపొందించేందుకు అన్నివిధాలా కృషిచేస్తామని, బ్యాంక్ నికరలాభాన్ని పెంచుతామని చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీనివాసులు శెట్టి ఉద్యోగులకు ఒక సందేశంలో తెలిపారు. దేశంలోకెల్లా ‘బెస్ట్ బ్యాంక్’గా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్బీఐ సగర్వంగా 50 కోట్లకుపైగా ఖాతాదారులకు సేవలందిస్తున్నదని, అన్ని బ్యాంకింగ్ సాధనాల్లోనూ మార్కెట్ లీడర్‌గా ఉన్నదని, నిస్పందేహంగా దేశంలోకెల్లా అతి పెద్ద బ్యాలెన్స్ షీట్ ఎస్బీఐదేనని వివరించారు.

ఈ దశాబ్ద ఆరంభం నుంచి ఇప్పటి వరకూ  మన బ్యాంక్ గ్లోబల్ ర్యాంక్ 35 స్థానాలు ముందుకు కదలింది. మార్కెట్ విలువలో ర్యాంకింగ్ 52 నుంచి 17కు పెరిగింది అంటూ శెట్టి  తెలిపారు. తన ముందువారు వేసిన పునాది ఆధారంగా మనం ఎస్బీఐని దేశంలో ఉత్తమ బ్యాంక్ గా వృద్ధి చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ‘ఈ దశాబ్దం ఇండియాది. అలాగే ఈ దశాబ్దం ఎస్బీఐది కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నా’ అంటూ సందేశాన్ని ముగించారు.

రూ. 7,500 కోట్లు సమీకరించిన బ్యాంక్

బసెల్ 3 టైర్ 2 బాండ్లను జారీచేసి రూ. 7,500 కోట్లు సమీకరించినట్టు ఎస్బీఐ బుధవారం తెలిపింది. 7.42 శాతం కూపన్ రేటుతో 15 ఏండ్ల కాలపరిమితికి బాండ్లను జారీచేసినట్టు పేర్కొంది. ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున బిడ్స్ అందాయన్నది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్‌లు ఇష్యూలో పాల్గొన్నట్టు తెలిపింది. బ్యాంక్ పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని కొత్త చైర్మన్ శెట్టి పేర్కొన్నారు.