12-02-2025 06:18:50 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగపూర్ లో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఈ కళ్యాణానికి మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. నియోజకవర్గంలోని ప్రజలకు మంచి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. శ్రీ పద్మాగోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం రోజున స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు.
ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేద పండితుల మంత్ర ఘోషణల మధ్య కల్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్ర పఠనం, వ్యాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని, ఉత్సవ విగ్రహాలకు, స్వామివారి, అమ్మవారి మూల విరాట్టు విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. దేవాలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివాహ ఘట్టాలను, మాంగళ్య ధారణ వంటి ఘట్టాలను వివరిస్తూ, ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వొడితల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.