- నిందితుడు ముగ్గురు చిన్నారులను చిదిమేసిన ఉన్మాది
- హాజీపూర్ గ్రామస్థుల్లో ఇప్పటికీ భయాందోళనలు
- వెంటనే కింది కోర్టుల తీర్పులు అమలు చేయాలి..
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ నేత వీహెచ్ లేఖ
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ముగ్గురు బాలికలపై లైంగికదాడికి పాల్పడి, వారిని హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే శిక్షించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు గురువారం పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) లేఖ రాశారు.
లేఖ సారంశమిది.. ‘యాదాద్రి భువగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి ఒక కేసులో జీవితఖైదీ. మరో రెండు కేసుల్లో ఇప్పటికే ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టులు తీర్పులు ఇచ్చాయి. తీర్పు వెలువడి కూడా నాలుగేళ్లయింది. 2015లో ఉన్మాదిలా ఒక బాలిక, 2019లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చాడు.
ముగ్గురు బాలికలూ 12 ఏళ్లలోపు వారే. ముగ్గురూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలే. నేను స్వయంగా నాడు హాజీపూర్ గ్రామానికి వెళ్లాను. బాధిత కుటుంబాలను ఓదార్చాను. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కి న్యాయస్థానాలు శిక్ష ఖరారు చేసినా, అవి అమలు కాకపోవడంతో మృతుల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి అనాగరిక ఘటనలు, వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి’ అని లేఖలో రాసుకొచ్చారు. మరోవైపు ఆయన గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదర పూర్వకంగా కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీకి సంబంధించి అనేక అంశాలపై కాసేపు చర్చించారు.