calender_icon.png 20 March, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు

20-03-2025 02:08:55 AM

  1. అంతకు ముందు డిప్యూటీ సీఎంతో కలిసి చైర్మన్‌కు ప్రతుల అందజేత 
  2. మహాత్మాగాంధీ, అంబేద్కర్, శ్రీశ్రీ కోట్స్‌తో సాగిన ప్రసంగం

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు ముగించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి బడ్జెట్ ప్రతులు అందజేశారు.

అనంతరం శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, శ్రీశ్రీ లాంటి మహనీయుల మాటలను కోట్ చేస్తూ బడ్జెట్ ప్రసంగం ఆసాంతం సాగింది. ‘నిజం కూడా ప్రతిరోజూ ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది’ అని కోట్ చేస్తూ చదివారు.

ప్రభుత్వం చేసే ప్రతీ చర్యను శంకిస్తూ విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్షాలను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ 15 నెలల పాలనలో ఏం చేశాం.. రాబోతున్న ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికలు వేసుకొని ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందకు తీసుకెళ్లబోతున్నామో వివరించారు. తెలంగాణ రైజింగ్ - 2050 ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

రైతు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పి ఏఐ విశ్వవిద్యాలయం, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సౌకర్యాలు, యువతకు అవగాహన కల్పించే కేంద్రాన్ని స్థాపించేందుకు చేస్తున్న కృషిని వివరించారు. తమ ప్రభుత్వం 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్టు ఆయన ప్రసంగంలో తెలిపారు. నిరుద్యోగ రేటును 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గించినట్టు వెల్లడించారు. 

గత ప్రభుత్వంపై చురకలు..

మంత్రి శ్రీధర్‌బాబు తన ప్రసంగంలో ఒకవైపు తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూనే మరోవైపు గత ప్రభుత్వాల వైఫల్యాలను ఏకరువు పెట్టారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత యువత పట్ల గత ప్రభుత్వం అవలంబించిన తీరును ఎండగట్టారు. ‘నది దాటే వరకు ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడ మల్లయ్య’ అనేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని ఆయన ప్రసంగంలో చురకలు అంటించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించిన యువత, నిరుద్యోగుల గురించి మంత్రి శ్రీధర్‌బాబు తన ప్రసంగంలో శ్రీశ్రీ కోట్‌ను చదివి వినిపించారు. ‘కూటి కోసం, కూలి కోసం, పట్టణం లో బతుకుదామని తల్లి మాటల చెవినపెట్టక బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత కష్టం’ అని కవితను వినిపించారు.

ఇలాంటి నిస్సహాయస్థితిలో ఉన్న నిరుద్యోగ యువతను తమ ప్రభుత్వం వచ్చాక వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశలను రగిల్చిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను చదువుతున్నప్పుడు అధికార పక్షానికి చెందిన సభ్యులు తమ మద్దతును వ్యక్తం చేయగా, బీఆర్‌ఎస్ సభ్యు లు మాత్రం కొన్ని చోట్ల వ్యతిరేకించారు.