calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే.. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం

12-04-2025 05:39:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర రాజధానిలో ఉంటున్న అందరికీ నాణ్యమైన జీవనం అందించాలని భావించామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం తెలంగాణ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ... మూసీ పరివాహకంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఇవ్వాలని నగరంలో నాణ్యమైన జీవనంతో పాటు యవతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జనసాంద్రత విపరీతంగా పెరిగినందున ప్యూచర్ సీటీని నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కాపాడిందని, కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఐ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

హెచ్‌సీయూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా..? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.  విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని, హైదరాబాద్ కు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని ప్రతిపక్ష నాయకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ ఉంటుందని, ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి వివరించారు. కంచె గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవని, రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే నిధులు సేకరిస్తుందని, 37 సంస్థలు బాండ్ల కోనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకుందని చెప్పారు.

టీజీఐఐసీ ద్వారా తాము నిధులు సేకరించి రైతులకు రుణమాఫీ చేశామని, రాష్ట్రంలోని రైతుల కోసం రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలా..? వద్దా..? బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కోరారు. గత ప్రభుత్వం ఎన్నడూ భూసేకరణ చేయలేదా..? భూసేకరణ నిబంధనల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదని, ఫార్మా సిటీ కోసం వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ హయంలో సేకరించలేదా..? అని శ్రీధర్ బాబు అడిగారు. పర్యావరణ పరిరక్షణ కోసమే మూసీని ప్రక్షాళన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హరితహారం కింద 10 వేల కట్ల మొక్కలు నాటామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని, 10 వేల కోట్ల మొక్కలు నాటి ఉంటే.. రాష్ట్రమంతా ఇప్పుడు మొక్కలే కనిపించాలి కాదా..? అని మంత్రి శ్రీధర్ బాబు వ్యంగ్యంగా మాట్లాడారు.