calender_icon.png 20 January, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నికృష్ణుడి పాత్రలో శ్రీదేవి తెరపై అల్లరి చేసిన చిత్రం

20-01-2025 12:18:39 AM

యశోద కృష్ణ.. 1975, జనవరి 20న విడుదలైన భక్తిరస తెలుగు చలనచిత్రం. చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో వీనస్ మహీజా పిక్చర్స్ పతాకంపై సీహెచ్ ప్రకాశరావు నిర్మించారు. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జమున, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి వేంకటేశ్వరరావు, బీ రామకృష్ణ, బేబి శ్రీదేవి, శ్రీవిద్య నటించారు.

సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు. 1974లో తమిళంలో వచ్చిన ‘శివకామిన్ సెల్వన్’ సినిమా దీనికి మూలం. కన్నడంలోనే యశోద కృష్ణ పేరుతో అనువాదమైంది. శ్రీకృష్ణుడి జీవిత విశేషాలతో, యశోదతో అతని అనుబంధాన్ని, గోకులంలో చిన్నికృష్ణుడు చేసిన అల్లరి చేష్టలను ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఈ సినిమాలో యశోదగా జమున, కంసుడిగా ఎస్వీఆర్ మెప్పించా రు. చిన్నికృష్ణుడి (బాల్యం) పాత్రను దివంగత నటి శ్రీదేవి, కృష్ణుడుగా జీ రామకృష్ణ నటించారు. యశోద భర్త నందుడిగా గుమ్మడి వేంకటేశ్వరరావు, వసుదేవుడిగా, నారదుడిగా చంద్రమోహన్ కనిపించారు. ఈ సినిమాలోని పాటలను ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య, సీ నారాయణరెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు రాశారు.

ఆసక్తికరమైన కథాకథనాలతో సాగే ఈ చిత్రం సంగీత ప్రాధాన్యమైనది కూడా కావటం విశేషం. పాటలు, పద్యాలన్నీ కలిపి మొత్తం 17 ఉంటాయిందులో. ఒక విధంగా ఈ పాటలు, పద్యాల్లోనే సినిమా కథను చెప్పించటం ద్వారా అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్.

ఒకప్పుడు పౌరాణిక, సాంఘిక నాటకాలకు ఆదరణ ఉన్న కారణంగా ఇందులోని పాటలు, పద్యాలు జనబాహుళ్యంలో ఆదరణకు నోచుకున్నాయి. ఘంటసాల, పీ సుశీల, వీ రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, ఏపీ కోమల, బీ వసంత, విజయలక్ష్మిశర్మ వంటి గాయనీ గాయకులు ఆలపించిన నేపథ్యగానం ప్రేక్షకులను రంజింపజేసింది.