07-04-2025 08:24:37 PM
ఆట పాటలతో అలరించిన కళాకారులు..
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శిఖర ఆర్ట్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని యాపల్ ప్రాంతంలోని కోదండ రామాలయం ఆవరణలో నిర్వహించిన శ్రీసీతారాముల కళోత్సవం-2025 కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ముందుగా నటరాజ స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిఖర ఆర్ట్స్ అధినేత, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు సారధ్యంలో జరిగిన కళోత్సవానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత సోత్కు సుదర్శన్ హాజరై, మాట్లాడుతూ... శ్రీరామ నవమిని పురస్కరించుకొని ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
పట్టణంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణిస్తున్న, మట్టిలో మాణిక్యాలు లాంటి కళాకారులు ఉన్నారన్నారు. కళాకారులకు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను శ్రీ రాముడి భక్తి గీతంతో ప్రముఖ గాయకుడు బాలు ప్రారంభించగా, కోల్ ఇండియా కళాకారుడు సాధనవేణి ప్రభాకర్ ఆర్కెస్ట్రా బృందం పాటలు, శ్రీ సాయి నాట్య కళానిలయం అశ్విని బృందం, ఆసం కళ్యాణ్ బృందం, ఏబిసిడి డాన్స్ అకాడమీ, యూట్యూబర్ సమీరా బృందం కళాకారులు పూసాల వ్రింద, బుక్యా హరిత, ప్రదర్శించిన జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ మిమిక్రి కళాకారుడు గౌరేష్ చేసిన మిమిక్రీ ప్రేక్షకులను అలరించింది.
అనంతరం కళాకారులను, నిర్వాహకులను, కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్, కోదండ రామాలయం ఆలయ కమిటి గౌరవ అధ్యక్షుడు బొద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్యక్షుడు సంగార్తి సంతోష్, సీనియర్ కళాకారులు రాకం సంతోష్, కొండపర్తి సది, ఎర్రవేణి రమేష్, అంతరుపుల మధులు పాల్గొన్నారు.