22-03-2025 06:50:51 PM
భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు
భద్రాచలం,(విజయక్రాంతి): వచ్చేనెల 6,7 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం పట్టాభిషేకం మహోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు అధికారులకు సహకరించాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు. శనివారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో భద్రాచలంలో స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నందున భక్తులు ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా స్వామివారి కళ్యాణం తిలకించడానికి తప్పకుండా కుటుంబ సభ్యులతో వస్తారని అందుకు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు స్వచ్ఛమైన మంచినీరు మజ్జిగ పాకెట్లు సరఫరా చేస్తున్నారు.
అందుకు స్వచ్ఛంద సంస్థలు మీరు ఈ అధికారులకు సహకరించి మీ సంస్థ ద్వారా వాటర్ పాకెట్లు మజ్జిగ పాకెట్లు భక్తులందరికీ అందే విధంగా చూడాలన్నారు. ఏ ఒక్క భక్తుడు అసౌకర్యాన్ని గురికాకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉన్నందున ఎక్కువ శాతం మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా వాలంటీర్స్ ని నియమించి అందరికీ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ఆయన అన్నారు. భక్తులు కళ్యాణం తిలకించేటప్పుడు తప్పనిసరిగా సెక్టార్లలో కూడా మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు అందేలా సంబంధిత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. మజ్జిగ ప్యాకెట్లు మంచినీరు సరఫరా చేసే వాలంటీర్లకు ప్రతి సెక్టార్ కు వెళ్లడానికి గుర్తింపు కార్డులు అందిస్తామని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తులకు మన ఇంటి మనసులు లెక్క భావించి సహకరించాలని అన్నారు.