15-02-2025 11:37:00 PM
మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మీర్‌పేట్ కార్పొరేషన్‌లో శనివారం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్‌పేట్ మాజీ మేయర్ దుర్గా దీప్‌లాల్ చౌహాన్‌లు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేశారు. యజ్ఞపూజల్లో పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ... శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దంలో జన్మించిన మహానీయుడు అన్నారు.బంజార తెగకు చెందిన ఆయన సామాజిక సంస్కర్తగా, అధ్యాత్మిక నాయకుడిగా ఎన్నో సేవలను అందించారన్నారు. బంజార తెగ అభివృద్ధి కోసం వారి హక్కులను కాపాడుతూ, ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తూ వారి జీవన విధానంలో మంచి మార్పులను తీసుకోచ్చిన ఉద్యమ జ్యోతి అన్నారు. సేవాలాల్ బోధనలు ఆత్మగౌరవం నింపేలా సాగేవన్నారు. కేంద్ర ప్రభుత్వం 2023లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్ణయించిందని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవన ప్రామాణాలు మెరుగుపర్చుకునేలా ఆయన జీవితం కొనసాగిందన్నారు. ప్రతి ఒక్కరు ఆయన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్‌లో సమాజానికి మేలు చేసేలా జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసంత్ సేవాలాల్ జయంతి కమిటీని సభ్యులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.