రక్షక కిట్ల పంపిణీలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని (విజయక్రాంతి): కల్లు తీసే గౌడ సోదరులకు శ్రీరామ రక్ష కాటమయ్య రక్షక కిట్లు అని కిట్ల పంపిణీలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని మండలంలోని అడవి సోమనపల్లిలో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షక కవచ కిట్లను ఎంపీ వంశీ కృష్ణ, కలెక్టర్ శ్రీహర్ష లతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రతి రక్షక కవచ కిట్ పై దాదాపు రూ. 9 వేల రూపాయలు ఖర్చు చేసి, సబ్సిడీ పై పూర్తి ఉచితంగా గౌడ సోదరులకు అందిస్తుందని, చెట్టు పై కల్లు తీసేందుకు వెళ్లినప్పుడు ఈ కిట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చని, ప్రతి గౌడ సోదరుడు ఈ కిట్ ను వినియోగించాలని మంత్రి అన్నారు. చెట్టు పైకి ఎక్కి కల్లు తీసే గౌడ సోదరులను గుర్తించి కాటమయ్య రక్షక కిట్లను ముందుగా పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమా, ఆర్.& బి ఈ.ఈ భావ్ సింగ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, ఎక్సైజ్ సూపరంటెండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.