calender_icon.png 16 March, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలవాట్లే శ్రీరామరక్ష

16-03-2025 12:00:00 AM

వయస్సుకు తగ్గట్టుగా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, మంచి అలవాట్లను పాటిస్తే అరవైలోనూ హుషారుగా ఉండొచ్చు. వృద్ధాప్యంలో శరీరంలో, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే నిత్యం చురుగ్గా ఉండాలంటే కచ్చితంగా కొన్ని అలవాట్లను పాటించాలి. అప్పుడే ఫిట్‌గా, హెల్తీగా ఉండగలరు. 

నిల్వ పదార్థాలలో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి. అలాగే ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు తేలికపాటి ఆహారం తినడానికి మాత్రమే మొగ్గు చూపాలి. 

అభిరుచులు

వయసుపైబడేవారిలో ఊబకాయం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్‌మెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ను విస్మరిస్తే  దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. పెయింటింగ్, సంగీతం, క్రీడలు లాంటివి జీవితంలో భాగం చేసుకోవాలి. 

ప్రోటీన్‌తో బలంగా..

అరవైకు ముందు చాలామంది రుచిగా ఉండే ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. కాని, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.  కాబట్టి నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి. ప్రోటీన్ ఫుడ్‌తో బలంగా ఉండొచ్చు. 

హాయిగొలిపే నిద్ర

వృద్ధాప్యంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.

చర్మం ఆరోగ్యం కోసం.. 

చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది. వయస్సుతో పాటు చర్మం పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎండ నేరుగా చర్మంపై పడకుండా సన్ లోషన్ లాంటి ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ కచ్చితంగా ఉపయోగించాలి. 

నా కోసం నేను

అరవైలో ప్రవేశించినా కూడా చాలామంది కుటుంబ సభ్యులు అవసరాలు, బాధ్యతలను గురించి తెగ ఆలోచిస్తుంటారు. తమ శక్తినంతా ఇతరులకే ఖర్చుచేస్తుంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరిచే ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లు, కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి.