06-04-2025 12:00:00 AM
నేడు శ్రీరామ నవమి పర్వదినం
హిందూ క్యాలెండర్ వివరణ ప్రకారం త్రేతా యుగంలో చైత్రమాసంలో శుక్ల పక్షం నవమి తిథి పుణ్య గడియల్లో, అనగా నేటి మధ్యాహ్న వేళల్లో అయోధ్యలో శ్రీ రాముడు జన్మించడం జరిగిన శుభ సందర్భంగా రామ నవమి పర్వదినాన్ని వైభవంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవడం అనాదిగా ఆచరించబడుతున్నది. అయోధ్య పదానికి అర్థంగా అ’ అనగా లేదు’అని, యోధ్య’ అనగా సంఘర్షణ’ అని, సంఘర్షణలు లేని ప్రదేశం’ అని అర్థం చేసుకుంటున్నాం.
ఈ రోజున పవిత్ర భావనలతో సీతారాముల మందిరాలకు వెళ్లి పూజలు చేయడం, స్వామి వాకడరి దీవెనలు పొందడం, భజనలు కీర్తనలు పాడడం, సీతా రాముల కళ్యాణ వేడుకలు నిర్వహించడం, హనుమ, లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలతో ఊరు వాడ ఊరేగింపులు నిర్వహించడం చూస్తూ ఉన్నాం.
శ్రీ విష్ణువు లేదా శ్రీ కృష్ణుడు మరో మానవ అవతారంగా శ్రీ రాముడిగా భువిపైకి రావడం, తన జీవనశైలిగా పాటు విలువలకు కట్టుబడి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం ద్వారా మానవాళికి సరైన జీవన విధానాలను బోధించడం జరిగింది.
శ్రీ రామ నవమికి ముందు నవరాత్రులను చైతన్య నవరాత్రులు’గా భక్తి శ్రద్ధలతో పాటించడం, రాముడి జన్మ స్థలమైన అయోధ్యలో ప్రధాన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. అయోధ్యతో పాటు భద్రాచలం, రామేశ్వరం లాంటి పలు ప్రధాన సీతారాముల దేవాలయాల్లో కూడా రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడం, లక్షల్లో భక్తులు దర్శనాలకు క్యూ కట్టడం చూస్తున్నాం. మర్యాద పురుషోత్తముడిగా శ్రీ రాముడు మానవ రూపంలో దైవంగా మానవీయ విలువలను తను ఆచరించి మనకు సనాతన ధర్మాలను బోధించడం జరుగుతున్నది. శ్రీ రాముడి జీవితం మంచి’ లేదా సన్మార్గం’కు ప్రతిరూపంగా, రావణుడి జీవితం చెడు’ లేదా దుర్మార్గం’ ప్రతిబింబించే విధంగా ఉండడం, రాముడి జీవితం చెడు పై మంచి విజయం’గా మనకు మార్గనిర్దేశనం చేస్తున్నది. రావణుడిపై రాముడి విజయం అమానవీయతపై మానవీయ విలువల విజయంగా కూడా భావిస్తున్నాం.
రామ, సీత, దశరథ్, హనుమ, కౌసల్య పాత్రల వైశిష్ట్యం
శ్రీ రాముడి తండ్రి దశరథ్ (దశ ; రథ్ = పది రథాలు) అనగా సుసంపన్న జీవితాలకు పది ఇంద్రియాలను సూచిస్తున్నది. వీటిలో ఐదు కర్మేంద్రియాలు (మాట లేదా నోరు, చేతులు, కాళ్లు, విసర్జన కేంద్రాలు, సంతోనోత్పత్తి కేంద్రాలు), మరో ఐదు జ్ఞానేంద్రియాలు (చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ) అని తెలుసుకుంటూ, సమతుల జీవన గమనానికి ఈ పది ఇంద్రియాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలని సూచిస్తున్నది.
రాముడి తల్లి కౌసల్య’ అనగా అద్భుత నైపుణ్యాలు లేదా కౌశలాలు కలిగిన వారు’ అని అర్థం చేసుకోవాలి. కౌసల్య బోధనలతో రాముడు అద్వితీయ జీవన కౌశలాలను నేర్చుకున్నట్లు తెలుసుకోవాలి. రాముడిని ఆత్మ’ లేదా సోల్’గా, సీతను మనస్సు’గా, హనుమను భక్తి, క్రమశిక్షణ, స్వయం-అవగాహన’గా, రావణుడిని గర్వం’కి రూపమని భావిస్తారు. ఆత్మను మనస్సుతో ఏకం చేయడానికి (రాముడిలో సీతను ఏకం చేయడం) భక్తికి కట్టుబడిన హనుమ సహాయంతో రామణుడి అతి గర్వానికి తగు శాస్తి జరగడం, సీతారాములు ఇద్దరు ఒకటి కావడం జరిగింది.
ప్రపంచ మానవాళికి అందిన అరుదైన అపూర్వ జీవనశైలి శాశ్వత నిఘంటువులుగా ఇతిహాసాలుగా శ్రీ మద్ రామాయణం, భారత భాగవతాలు అందించబడ్డాయి. ప్రతి ఒక్క రు దేవుడిపై భక్తి, శ్రద్ధలతో సత్యధర్మ, క్రమశిక్షణ, సహృదయాలనే సుగుణాలను కలిగి తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి, ఈ మార్గంలో శ్రీ రాముడు మనకు అదృశ్య చేయూతను ఇస్తున్నాడని నమ్ముతూ మన జీవనయానాలను కొనసాగిద్దాం, అశాంతికి తావు లేని ప్రపంచాన్ని నిర్మించుకుందాం.
సత్య యుగం నుంచి కలియుగం వరకు..
కాల చక్రంలో సత్య యుగంలో దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధాలు జరగడం, త్రేతాయుగంలో రెండు మహారాజ్యాల మధ్య పోరాటం జరగడం, ఆదర్శ రాముడి చేతుల్లో అనైతిక రామణుడి మరణం సంభవించడం చూసాం. ద్వాపరయుగంలో జగన్నాథుడి దర్శకత్వంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు (పాండవులు, కౌరవులు) సోదర సమూహాల మధ్య యుద్ధం జరిగి దుర్మార్గపు ఆలోచనలపై సన్మార్గపు సదాలోచనలు గెలవడం జరిగింది.
నేడు నడుస్తున్న కలియుగంలో వ్యక్తుల్లో గర్వం, దురాశ, అక్రమార్జన లాంటి దుర్గుణాలు మొలకెత్తి నిరంతరం అంతరంగాల్లో అంతర్యుద్ధం జరుగుతూ ఉన్నది. త్రేతాయుగంలో శ్రీ రామాయణం (రాముడి జీవన ప్రయాణం)లో బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర అనబడే ఏడు కాండలు ఉన్నాయని, అందుకోని ప్రతి పాత్ర మానవజాతికి సన్మార్గాలను చూపుతున్నాయని మనకు తెలుసు.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037