05-04-2025 08:35:02 PM
భద్రాచలం,(విజయక్రాంతి): శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కన్నుల పండుగగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ఒక రోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. ఋత్వికులు వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా ఈ పండువ సాగింది.
ఆలయ పరిసరాల్లో భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. ఉత్తర ద్వార దర్శనం ఎదురెదురుగా శ్రీ రాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు. వధూవరుల వంశ కీర్తి ప్రతిష్ఠల్ని వేదపండితులు వివరించారు. చూడచక్కని వాడు ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా సుగుణాల రాశి సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలంటూ సీతమ్మ తల్లి తరుపున అర్చకులు అమ్మ వారిని కీర్తించారు. వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వధూ వరుల వంశాల విశిష్ఠతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. సీతారాముల గుణగణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కనుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు.