05-04-2025 06:11:13 PM
కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొననున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్..
కరీంనగర్ (విజయక్రాంతి): శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి శ్రీ మహాశక్తి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం శ్రీ మహాశక్తి దేవాలయ ఆవరణ ప్రాంగణాన్ని విశేష అలంకరణలతో కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు.
కళ్యాణం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అందించే అన్న ప్రసాద వితరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. ముగ్గురు అమ్మవార్లతో మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో హిందూ ధర్మ ప్రచారకులు శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీతో పాటు పుర ప్రముఖులు పాల్గొననున్నారు. కేబి శర్మ శిష్య బృందంచే సంగీత విభావరి కూడా నిర్వహించనున్నారు. సమస్త భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామివారి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.