12-02-2025 02:56:13 PM
స్వామి వారి దర్శనం చేసుకున్న వేలాది మంది భక్తులు
నేడు వెంకటేశ్వర స్వామి తేరు మహోత్సవం
అర్ధరాత్రి జరగనున్న వేడుకలు.. వేలాదిమంది భక్తుల రాకకు ముందస్తు ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి హనుమతావాహన సేవ కార్యక్రమం(Sri Lakshmi Venkateshwara Swamy Temple) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభయమానంగా అలంకరించిన హనుమత్వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితులు వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల స్మరణలో స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అనంతరం ప్రభోత్సవం నిర్వహించారు. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు స్వామివారికి దాసంగాలు పెడుతూ మొక్కులు తీర్చుకున్నారు. గుండంలో తలస్నానాలు ఆచరించి తడి దుస్తులతోనే స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు రాత్రి స్వామి వారి తీరు మహోత్సవ వేడుకలు ఉన్న సందర్భంగా భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల రాకను ముందే గుర్తించి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అలహరి మధుసూదన కుమార్(Temple Chairman Alahari Madhusudhan Kumar), ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.