26-04-2025 09:24:21 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీ కేశవనాథ స్వామి ఆలయ భూములను అన్యాక్రాంతం నుండి రక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. శనివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... శ్రీ కేశవనాథ స్వామి ఆలయానికి మొత్తం దాదాపు 90 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 83 సర్వే నంబర్ లో ఉన్నటువంటి 8.22 ఎకరాల భూమిలో కొందరు ఆలయ భూమిని ఆక్రమించి, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు.
గతంలో రెవెన్యూ పరిధిలో ఉన్న క్రమంలో అలా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు ఆలయానికి నిర్ణీత కిరాయి చెల్లించాలని ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క పైసా కూడా కట్టలేదని అన్నారు. ఎండోమెంట్ శాఖా అధికారులు ఇప్పటికైనా పూర్తి సర్వే చేయించి ఆలయ భూములను రక్షించాలని కోరుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దాదాపు సంవత్సరానికి 17 లక్షల ఆదాయం ఉన్న ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఎండోమెంట్ శాఖపై ఉందని ఈ రకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మనోజ్,వెంకట్ రవీందర్,రాజేశ్వర్ రావు ఆలయ పూజారి నరేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.