12-04-2025 05:08:43 PM
ఘనంగా అంకమ్మ తల్లి కొలుపు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లిలో ప్రసిద్ధిగాంచిన మహిమగల, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన ఆరాధ్య దైవం శ్రీ అంకమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అభివృద్ధి ప్రధాత మారగాని శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా జరుగుతున్నాయి. అంకమ్మతల్లి పూజ కార్యక్రమాలు రాత్రి పూల కాపేర, రెడకప్పేర అమ్మవారి గ్రామ సేవ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ అనంతరం అమ్మ వారికి గంగాభిషేకం చేయడంతో ఉత్సవాలు ప్రారంభమై ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగునున్నాయి.
చివరి రోజు ఈనెల 13న ఉదయం అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టుట, అగ్నిగుండ ప్రవేశం, ఘన చారులు, శివసత్తుల విన్యాసాలు, బద్దె గొర్రె కార్యక్రమం అనంతరం శ్రీ గోపయ్య తిరుపతమ్మ అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంచోచ్ఛారణతో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి ప్రధాత హరి హర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించుతున్నామన్నారు. అనంతరం మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వచ్చే భక్తులు మొక్కుబడులు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక వారి సౌజన్యంతో పేర్ని డ్యాన్స్, భరతనాట్యం, కూచిపూడి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహణతో గిరిజన గ్రామాల్లో ఈ నృత్యం ప్రదర్శనను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు కన్నుల పండువగా ఆహ్లాదంగా అలరించాయి. కళాపోషకులకు ఆలయ మెమొంటో పాటు, చిరు సన్మానంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంకమ్మ తల్లి ఆలయ చైర్మన్ పానుగంటి రాఘవులు, చల్ల రమేష్, చల్ల లక్ష్మణరావు, ఇనపనూరి రాంబాబు, అర్జున్ ప్రసాద్, చిట్టి బొమ్మల కోటేశ్వరరావు, చిట్టి బొమ్మల బాబు, నర్సింహచారి, నసరుద్దీన్, ఆలయ పూజారులు కాలసాని పుల్లయ్య, ధారావత్ శంకరయ్య, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.