calender_icon.png 29 April, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచి కామకోటి పీఠాధిపతిగా గణేష శర్మ.. శుభాభినందనలు తెలిపిన సీఎం

29-04-2025 02:19:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కంచి కామకోటి పీఠం 71వ ఆచార్యులుగా శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ అభిషేక వేడుక శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి శుభాభినందనలు తెలియజేశారు. గణేష శర్ ఋగ్వేద పండితులుగా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవికి, తెలంగాణ ప్రాంతానికి ఎలలేని ధార్మిక సేవ చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఋగ్వేదంలోనే కాకుండా యజుర్వేదం, సామవేదం, షడాంగాలు, దశోపనిషత్తుల్లో జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి కృపతో అపారమైన జ్ఞానార్జన చేశారని గుర్తుచేశారు. సనాతన ధర్మ గురుపరంపరకు, భక్తి తత్వానికి, జ్ఞాన మార్గానికి బాటలు వేసే ఈ వేడుక తెలంగాణ ప్రజలందరికీ మధుర జ్ఞాపకం కాబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

మంగళకరమైన అక్షయ తృతీయ రోజున (30 ఏప్రిల్) జరగనున్న ఈ అభిషేక వేడుక సందర్భంగా శ్రీ కంచి కామకోటి పీఠానికి తెలంగాణ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రణామాలు తెలియజేశారు. ఈ గురుపరంపర ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని మానవాళికి ఎల్లప్పుడూ అందించాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.