calender_icon.png 27 January, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

27-01-2025 12:50:37 AM

  1. హైదరాబాద్‌లోని అన్ని హాస్టళ్లకు ఇక్కడి నుంచే ఆహారం 
  2. వేలమందికి భోజనం అందించే కిచెన్ అధ్వానంగా నిర్వహణ
  3. ఎలుకలు, బొద్దింకలు.. కాలం చెల్లిన ఆహారపదార్థాలు 
  4. వంటగది సీజ్ 

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఫుడ్‌సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24న ఈ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఇక్కడి నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు. వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు, కిచెన్‌ను సీజ్ చేయాలని, ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

ఈ మేరకు అధికారులు మాదాపూర్ (ఖానామెట్)లోని చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.