12-02-2025 02:41:39 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర దేవాలయం వరకు కన్నాల గ్రామం నుండి చేపట్టనున్న రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. రూ.3 కోట్ల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులను గత సంవత్సరం అక్టోబర్ 3న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లాంచనంగా ప్రారంభించారు. మూడు నెలలుగా రోడ్డు పనులు ముందుకు సాగలేదు. ఇదే క్రమంలో ఈనెలలో పెద్దపులి సంచారం తీవ్రంగా భయపెట్టడంతో బుగ్గ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పనులు ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో నుండి పెద్దపులి వెళ్లిపోవడం, ఈనెల 26న శివరాత్రి జాతర ఉండడంతో రోడ్డు పనులను ప్రారంభించారు. మహాశివరాత్రి జాతరకు ముందుగా రోడ్డు పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనట్లయితే బుగ్గలో జాతరకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.