30-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): గతేడాది డిసెంబర్ 4న నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో గల సంధ్య థియేటర్‌లో పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. 4 నెలల 25రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు బాలుడిని డిశ్చార్జ్ చేశారు.
అనంతరం అతన్ని రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ 15రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ నిర్వహించి, ఇంటికి తీసుకెళ్లొచ్చని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు లేకుండా శ్రీతేజ ఆరోగ్యం కాస్త పరువాలేదన్నట్లుగా ఉన్నదని చెప్పారు. అయితే ఇప్పటికీ అందరినీ పూర్తిగా గుర్తు పట్టడం లేదని తెలుస్తోంది.
శ్రీతేజ్ వైద్యం కోసం ప్రభుత్వంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పుష్ప-2 సినిమా బృందం సహకారాన్ని అందించారు. కాగా తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో నటుడు అల్లూ అర్జున్ జైలుకు కూడా వెళ్లిన విషయం విధితమే.