19-04-2025 03:27:41 PM
తిమ్మాపూర్,(విజయక్రాంతి): అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-25 ద్వారా ఎన్ఐటీలో ప్రవేశానికి కరీంనగర్ జిల్లా పరిధిలోని అలుగునూర్ కార్పొరేషన్ లోగల ఎస్ఆర్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్చార్జ్ నేదురు తిరుపతి తెలిపారు. శనివారం అలుగునూర్ లోని ఎస్సార్ కళాశాల ఆవరణలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కళాశాలకు చెందిన దాదాపు 185 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ లో విజయ పతాకాన్ని ఎగరవేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 12లక్షల 50వేల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 2లక్షల 20వేల మంది అర్హత సాధించారని తెలిపారు.
ఇందులో ఎస్ఆర్ కళాశాలకు చెందిన 600మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 185 మందికిపైగా అర్హత సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు వై భరణి శంకర్ జాతీయస్థాయిలో 88వ ర్యాంకు, బీ సురేష్ 98వ ర్యాంకు, ఏ కార్తిక్ 584వ ర్యాంకు, లకావత్ మాధవ్ చరన్ 707వ ర్యాంకు, లునావత్ రామ్ చరణ్ 777వ ర్యాంకు, పత్తెం హృషికేష్ 796వ ర్యాంకు సాధించగా వారితోపాటు మరో ఏడుగురు విద్యార్థులు 6వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఇంతటి విజయాన్ని అందించి, కళాశాలకు జాతీయస్థాయిలో పేరు తీసుకొచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవ రెడ్డి, జోనల్ ఇన్చార్జ్ నేదురు తిరుపతి, ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.