calender_icon.png 24 October, 2024 | 6:56 PM

స్పౌజ్ బదిలీల్లో నిబంధనలకు నీళ్లు

12-07-2024 12:05:27 AM

  1. మెదక్ జిల్లాలో 13 మంది గుర్తింపు
  2. అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం
  3. విద్యాశాఖ ఆదేశాలతో వివరాల సేకరణ

మెదక్, జూలై 1౧ (విజయక్రాంతి): ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ కోసం దారితప్పారు. నిబంధనలు బేఖాతరు చేశారు. భార్యాభర్తలు (స్పౌజ్ క్యా టగిరీ) ఒకేచోట పనిచేసేందుకు ఉద్దేశించిన వెసులుబాటు మంచిదే అయినప్పటికీ, కొందరు ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

స్పౌజ్ బదిలీల్లో భాగంగా భార్య, భర్త ఒకే మండలంలో పోస్టింగ్‌కు దరఖాస్తు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కొందరు హెచ్‌ఆర్‌ఏ అధికంగా లభించే దూరంగా ఉండే పాఠశాలలు ఆప్షన్‌గా చూపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగం చేసిన టీచర్ల జాబితాను సిద్ధం చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సోమవారం ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు స్పౌజ్ పాయింట్లను వినియోగించుకొని ఒకే మండలంలో కాకుండా ఇతర మండలాల పాఠశాలలకు వెళ్లిన స్పౌజ్ ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. 

13 మంది గుర్తింపు..

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఓ పాఠశాలలో లాంగ్ స్టాండింగ్‌లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు స్పౌజ్ పాయింట్లను వాడుకొని అదే మండలంలోని మరో గ్రామానికి వెళ్లాల్సి ఉంది. కానీ హెచ్‌ఆర్‌ఏ అధికంగా పొందాలనే ఉద్దేశంతో మెదక్ మండలంలోని మరో పాఠశాలను ఎంచుకొని అక్కడికి వెళ్లారు. ఇలా ఆ ఒక్క ఉపాధ్యాయురాలే కాకుండా మెదక్ జిల్లాలో స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసిన 13 మందిని గుర్తించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా రు. స్పౌజ్ పాయింట్ల దుర్వినియోగంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయిన స్పౌజ్ ఉపాధ్యాయుల వివరాలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. జిల్లాలో ఇంకా ఎంతమంది ఉపాధ్యాయులు స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారో లెక్క తీస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్, కొల్చారం, రామాయంపేట, తూప్రాన్, చిలప్‌చేడ్, టేక్మాల్ మండలాల్లో 13 మందిని గుర్తించారు. ఈ మేరకు స్పౌజ్ పాయింట్లు వినియోగించుకున్న టీచర్ల జాబితాను ఎంఈవోల నుంచి తెప్పించుకుంటున్నారు. దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని తెలుస్తోంది. 

స్పౌజ్ పాయింట్లు ఇలా..

భార్య, భర్త ఇద్దరూ పనిచేసే పాఠశాలలకు దగ్గరగా ఉండాలనే నిబంధన మేరకు బదిలీల్లో ప్రత్యేకంగా పాయింట్స్ కేటాయిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక ప్రాధాన్యత పాయింట్లు పొందిన తర్వాత భార్యాభర్తలు ఎనిమిదేళ్లకు ఒకసారి ఎవరో ఒకరు మాత్రమే పాయింట్లను వినియోగించుకోవాలి. స్పౌజ్ పాయింట్లు తీసుకునే టీచర్లు తమ రేడియస్‌లోనే బదిలీ స్థానాన్ని ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఒకవేళ అదే మండలంలో ఖాళీ లేకపోతే పక్క మండలాలు, తర్వాత మండలాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. కానీ అలా కాకుండా కొందరు తమకు నచ్చిన, హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ వచ్చే మండలాలకు వెళ్లేలా వెబ్ ఆప్షన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

చర్యలు తీసుకుంటున్నాం..

జిల్లాలో స్పౌజ్ పాయింట్లు వాడుకున్న కొందరు ఉపాధ్యాయులు అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా 13 మందిని గుర్తించాం. వారందరికి తిరిగి వేరే స్థానాలను కేటాయించాం. ఇంకా ఎవరైనా ఉన్నారేమో వివరాలు సేకరిస్తున్నాం. దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. 

 రాధాకృష్ణ, డీఈవో, మెదక్ జిల్లా