calender_icon.png 6 November, 2024 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో క్రీడా పాలసీ

03-08-2024 03:51:33 AM

  1. వచ్చే సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెడుతాం 
  2. భవిష్య నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 
  3. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
  4. తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెడతామని వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అందులో భాగంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ పబ్లిక్ సర్వీసుల క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ సవరణ చేస్తున్నట్లు భట్టి వివరించారు. ఇప్పుడు ఉన్న నిబంధన మేరకు వారికి గ్రూప్ ఉద్యోగాలు ఇవ్వలేనందున చట్ట సవరణ చేస్తున్నట్లు చెప్పారు. సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సభను కోరారు. 

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం

ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న క్రీడా విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అవసరమయ్యే కొత్త పాలసీ రూపకల్పన చేస్తామని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన అధ్యయనంలో హర్యానా స్పోర్ట్స్ పాలసీ బాగుందని తెలిపారు. ఆ రాష్ట్రంలో క్రీడాకారులకు ఇస్తు న్న ప్రోత్సాహకాలు బాగున్నాయని ప్రశంసించారు. ప్రతి మండలంలో మినీ స్టేడీయాలు నిర్మించాలని సభ్యులు కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. అయి తే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని, ప్రభుత్వ భూములు కబ్జాలకు గుర య్యాయని, అందుబాటులో భూమి ఉన్న చోట తప్పకుండా మినీ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేసేందుకు క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల నుంచి సూచనలు తీసుకుంటాం

స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనలో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ముచ్చర్లలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుచేస్తున్నామని, ఇక్కడ అన్ని క్రీడలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఏ క్రీడ జరిగినా.. ఇక్కడి నుంచి క్రీడాకారులు వెళ్లేలా శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

శాసన సభ్యులకు క్రీడా పోటీలు

గతంలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించేవారని, కొంతకాలంగా ఆపేశారని సీఎం గుర్తు చేశారు. వీలైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో.. లేకుంటే బడ్జెట్ సెషన్‌లో సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించేలా చూడాలని స్పీకర్‌ను కోరారు. రాష్ట్రంలోని యువత ప్రజా ప్రతినిధులను ఆదర్శంగా తీసుకుంటారని, ఎమ్మెల్యేలు క్రీడల్లో పాల్గొంటే యువత కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు.

బడ్జెట్‌లో తగిన నిధులు: భట్టి

క్రీడల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.320 కోట్లు కేటాయించామని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో నిర్మించిన అనేక స్టేడియాలు నేడు షాదీఖానాలు, రాజకీయ సమావేశాలకు నిలయంగా మారాయని అన్నారు. విద్యార్థులు, యువతను క్రీడలవైపు ప్రోత్సహించే ఉద్దేశంతోనే నిఖత్‌కు, సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని వెల్లడించారు. వారికి 600 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చెప్పారు.  

నా రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడు: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

నిఖత్ జరీన్, సిరాజ్‌కు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం హర్షణీయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తనకు సిరాజ్ బాగా తెలుసని, తన రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడని తెలిపారు. మరో ముగ్గురు క్రీడాకారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. హైదరాబాద్ నుంచి క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయిడు, గుత్తా జ్వాలకు కూడా ప్రభుత్వ స్థలం ఇవ్వాలని సూచించారు.

సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ కాలేజీలు ఉన్నా, వాటిలో తగిన సౌకర్యాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అందులో కోచ్‌లను నియమించాలని కోరారు. డిప్యూటేషన్‌పై కోచ్‌లు వస్తే తప్ప కాలేజీలు నడిచే పరిస్థితి లేదని తెలిపారు. 

నైపుణ్యం ఉన్నవాళ్లను ప్రోత్సహించాలి: దానం

కొందరు ఆటలో నైపుణ్యం లేకున్నా అకాడమీలు ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. అందుకే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రికెట్‌లో నైపుణ్యం లేకున్నా పలుకుబడితో కొందరు జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారని తెలిపారు. 

తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. సభలో శుక్రవారం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెడుతామని గతంలో కేసీఆర్ ప్రకటించారని, అది ఇంతవరకు అమలు కాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి సీఎం రేవంత్‌కు రాసిన లేఖను అందజేశారు.

అనంతరం ఈ అంశంపై సీఎం స్పందించారు. సురవరం ప్రతాపరెడ్డి తెంలగాణ వైతాళికులని, అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే తెలుగు వర్సిటీకి ఆయన పేరును పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అనంతరం కేటీఆర్ దీనిపై మాట్లాడారు. తెలుగు వర్సిటీకి ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించినా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున అది సాధ్యం కాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మారిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. మిగతా రాజకీయ పక్షాలు కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేశాయి. దీంతో త్వరలో యూనివర్సిటీ పేరును మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.