calender_icon.png 26 October, 2024 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ చివరి నాటికి క్రీడా విధానం

26-10-2024 12:00:00 AM

  1. దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలి
  2. సత్వరమే స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు 
  3. రేండేళ్లలో రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించాలి
  4. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాలసీ) సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని అన్నారు.

అందుకు విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరుపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీపై శుక్రవారం తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం లో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకో వాలని, ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలం గాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

అందులో చేయాల్సిన మార్పులు చేర్పులను సీఎం సూచించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. తన దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అక్కడి కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా గుర్తిం చిన అంశాలను తెలియజేశారు.

రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి దక్షిణ కొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో చర్చించిన అంశాలను పరిగణన లోకి తీసుకోవాలని అధికారుల కు సూచించారు. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీతోపాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ అనుసరిస్తు న్న విధానాలపై అధ్యయనం చేయాలని అధికారు లను ఆదేశించారు.

మరో పది రోజుల్లోనే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను వెంటనే తయారు చేయాలని సూచించారు. వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్‌ను సంప్రదించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.