calender_icon.png 21 November, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికటించిన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అస్వస్థత

21-11-2024 01:40:03 AM

  1. ఆసుపత్రిలో చేరిన 15 మంది విద్యార్థులు
  2. నారాయణపేట జిల్లా మాగనూరులో ఘటన

నారాయణపేట, నవంబర్ 20 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన  ఘటన బుధవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. సాంబారు, గుడ్లతో మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు.

కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తన సొంత వాహనంలో తరలించారు. వంట ఏజెన్సీపై తీవ్రంగా మండిపడ్డారు. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

డీఈవో పాఠశాలకు చేరుకుని విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులను తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరించిన రిపోర్టర్లపై అక్కడికి వచ్చిన డాక్టర్ అప్రోచ్ దురుసుగా మాట్లాడారు.

మీకు ఐడి కార్డులు ఉన్నాయా మీరు రిపోర్టర్ లేనా అంటూ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాపై మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ నాయకులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. 

ఘటనపై సీఎం ఆగ్రహం 

హైదరాబాద్: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

ఈ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని, కార ణాలేమిటో దర్యాప్తు చేసి బాధ్యులెవరో నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీపడేది లేదని, ఎక్కడైనా ఇ లాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినం గా వ్యవహారిస్తామని సీఎం స్పష్టం చేశారు.