calender_icon.png 1 March, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆధ్యాత్మిక మహాక్రతువు

28-02-2025 12:00:00 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం  మహాకుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. ప్రయాగ్ రాజ్‌లో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా ఈ సారి మహాకుంభమేళాగా జనవరి 13న సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రిరోజు చివరి అమృత్‌స్నాన్‌తో ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహాక్రతువులో ఆసేతుశీతాచలం కోట్లాది హిందువులతో పాటుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన లక్షలాది మంది విదేశీయులుసైతం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు.

ఈ మహాకుంభమేళాకు 45 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదట అంచనా వేసింది. అయితే ఆ అంచనాలను మించి భక్తులు త్రివేణీ సంగమం ఘాట్లకు పోటెత్తారు. మొత్తం 45 రోజుల్లో దాదాపు 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన చెప్పడం గమనార్హం.  చివరి రోజు మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో ‘హరహర మహాదేవ్’ నామస్మరణతో ఘాట్లు మార్మోగాయి. కోటిన్నర మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

‘ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా నిజంగా ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మారింది. ఈ మహాక్రతువు విజయవంతంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి మోదీ విజన్  ప్రధాన కారణం. ఆధ్యాత్మిక టూరిజంను దేశ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేయాలన్న ప్రధాని ఆలోచన ఉత్తరప్రదేశ్‌ను గొప్ప పర్యాటక హబ్‌గా తయారు చేసింది’ అని కుంభమేళా ముగిసిన సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యోగి చెప్పారు.

కుంభమేళాలో భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో తెలిపారు. హిందువుల ఐక్యతకు సంబంధించిన ఈ మహాక్రతువు విజయవంతమయినందుకు ఆయన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహాకుంభమేళాను ఇటు సంప్రదాయం, సాంకేతికత, అటు వాణిజ్యం, ఆధ్యాత్మికతల కలయికగా అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అభివర్ణించడం విశేషం. 

ఎవరు అవునన్నా, కాదన్నా మహాకుంభమేళా దేశంలోని హిందువులందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. కులం, మతం, సంపన్నుడు, సామాన్యుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం ఉప్పెనలా తరలి వెళ్లారు. 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారంటే ఐరోపాలోని అనేక దేశాల మొత్తం జనాభాకు ఇది సమానం.

ఇంతమంది భక్తుల కోసం యూపీ ప్రభుత్వం వేల కోట్ల వ్యయంతో కనీవినీ ఎరుగని ఏర్పాట్లే చేసింది. తాత్కాలికంగా ఒక నగరాన్నే ఏర్పాటు చేసింది. లక్షలసంఖ్యలో తాత్కాలిక నివాసాలు, టాయిలెట్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి దాదాపు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు అహోరాత్రులు శ్రమించారు.

వారి శ్రమగురించి ఎంత పొగిడినా తక్కువే. ఇంత భారీ క్రతువులో చిన్నపాటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం సహజమే. జనవరి 29న మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మృతిచెందగా, 60 మంది గాయపడ్డారు. అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు.

ఈ రెండు ఘటనలు కాకుండా మేళాకు వస్తున్న, తిరిగి వెళ్తున్న పలువురు భక్తులు వివిధచోట్ల మృతి చెందారు. మూడు నాలుగు అగ్నిప్రమాదాలు కూడా జరిగాయి. అయితే ఇలాంటివి సాధారణమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటుగా పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా ‘వసుధైక కుటుంబకం’ అన్న హిందుత్వ సిద్ధాంత బలాన్ని నిరూపించారు. మరికొన్ని సంవత్సరాలు పాటు దేశంలో ప్రతి ఇంటా ఈ మహాకుంభమేళా గురించే చర్చించుకుంటారనడంతో సందేహం లేదు. దేశంలోనే ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.