calender_icon.png 9 February, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక విహారం

09-02-2025 12:00:00 AM

కాస్త తీరిక, చేతినిండా డబ్బు ఉన్నప్పుడు ఏదో ఒక చోటకి వెళ్లాలని అందరూ అనుకుంటారు. అయితే ప్రతి యాత్రకూ ఓ అర్థం ఉండాలని, ఆ అనుభూతుల్ని చక్కటి జ్ఞాపకాలుగా పదిలపరుచుకోవాలని కోరుకుంటున్నారు. ఆధ్యాత్మికానికి ప్రాధాన్యమిస్తూ.. పర్యాటక ప్రదేశాలను, ఆహ్లాదాన్ని పంచే వాతావరణాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను.. ఇలా రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో ఒకటి తమిళనాడులోని రామేశ్వరం. అక్కడి పర్యాటక ప్రదేశాల విశేషాలేంటో తెలుసుకుందాం..  

రామేశ్వరం.. తమిళనాడులోని ముఖ్య పర్యాటక ప్రదేశాల్లో రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి. ఇక్కడ శివుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీ రాముడు సీతాదేవిని రావణాసురుడి చర నుంచి కాపాడటం కోసం శ్రీలంకకు వెళ్లడానికి ఇక్కడి నుంచే వంతెనను నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. 

ధనుష్కోటి.. భారతదేశంలో చిట్టచివరి గ్రామం. 1964లో వచ్చిన భారీ భూకంపం కారణంగా బంగాళాఖాత సముద్రంలో మునిగింది. గతంలో ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు వాణిజ్య మార్గంగా ఉండేది. ఇప్పుడు ఈ పట్టణం పర్యాటక ప్రదేశంగా మారింది. ధనుష్కోటిలో ఉన్న అతి అందమైన దృశ్యాలు పర్యాటకులను ఆకర్షించేవిగా మారాయి. ధనుష్కోడి బీచ్ విశాలమైన తెల్లటి నీరు, నీలి సముద్రం వంటి దృశ్యాలతో నిండి ఉంటుంది. ఇది చిత్రకారుల, ఫోటో గ్రాఫర్లకు ప్రియమైన ప్రదేశం. 

రామసేతు.. ఆడమ్స్ బ్రిడ్జ్, రామసేతు లేదా రాముడి వంతెన అని కూడా పిలుస్తారు. రామాయణంలో ఆడమ్స్ బ్రిడ్జ్ రాముడు తన సైన్యంతో కలిసి లంకలో రావణుడిపై యుద్ధానికి వెళ్లడానికి నిర్మించిన వంతెన. ఇది భారతదేశంలోని పాంబన్ ద్వీపాన్ని (రామేశ్వరం దీపం) శ్రీలంకలోని మన్నార్ ద్వీపంతో కలిపే నీటిపై తేలియాడే సున్నపురాయితో నిర్మించిన వంతెన. ఈ వంతెన 50 కి.మీ పొడవులో ఉంటుంది. ఆడమ్స్ బ్రిడ్జ్ సందర్శించాలంటే.. ధనుష్కోడి బీచ్ నుంచి బోట్ ద్వారా ప్రయాణించవచ్చు. 

పంబన్ బ్రిడ్జ్.. పంబన్ వంతెనను 1911లో నిర్మించారు. ఇది బంగాళాఖాతపు నీటిపై వేసిన 2.3 కిలోమీటర్ల పొడవైన, అ ద్భుతమైన నిర్మాణం. ఈ వంతెన పైన రైళ్లు, అలాగే బస్సులు ద్విచక్ర వాహనాలు కూడా నడుస్తాయి. వంతెన చుట్టూ ఉన్న దృశ్యాలు సహజ అందాలతో నిండి ఉంటాయి. ఇక్కడ ఉన్న సముద్రం, గాలి, ప్రకృతి ప్రేమికుల కోసం ఒక అందమైన గమ్యస్థానం.

గండమాదవ పర్వతం.. గండమాదవ పర్వతం రామాయణం పఠనంలో ప్రధానమైన ప్రదేశం. లంకపై రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు రాముడు ఈ పర్వతం వద్ద ఆగి తన సైన్యంతో కలిసి విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వతం ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే రాముని పాదముద్రలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. పర్వతంపై నుంచి రామేశ్వరం ద్వీపం, సముద్ర దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. 

అరియమాన్ బీచ్.. అరియమాన్ బీచ్ రామేశ్వరంలోని అందమైన తీరప్రాంతం. ఇక్కడ పర్యాటకులు బోటింగ్, పారాషూటింగ్ వంటి జలక్రీడలు ఆడవచ్చు. ఇవి అదనపున ఉల్లాసాన్ని తెస్తాయి. బీచ్ వద్ద పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పార్క్, నిఘా టవర్, ఒక ఆక్వేరియం కూడా ఉంది. ఇవి కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని ఇస్తాయి. 

ఎలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం ఉంటుంది. రైలు, బస్సు, విమాన సౌకర్యం కలదు. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 19 గంటల సమయం పడుతుంది.