calender_icon.png 18 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక జనసంద్రం

14-01-2025 12:00:00 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా సంరంభం మొదలైంది. జనవరి 13న పౌర్ణమినాడు మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజుల పాటు మినీ భారతాన్ని తలపించే విధంగా సాగే ఈ మహా కుంభమేళా కోసం పవిత్ర త్రివేణీ సంగమమైన ప్రయాగ్‌రాజ్ భక్త జన సందోహంతో కిటకిటలాడనుంది. దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అంటే దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు వస్తారన్న మాట. వీరే కాకుండా విదేశాలలోని ప్రవాస భారతీయులు, విదేశీయులు కూడా పెద్దసంఖ్యలో ఇప్పటికే ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. ఈ మహా ఉత్సవం కోసం ఏడాది ముందునుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. రూ.12,700 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం వచ్చే లక్షలాది భక్తుల కోసం త్రివేణీ సంగమం వద్ద ఓ తాత్కాలిక మహా నగరమే ఏర్పాటయిందని చెప్పవచ్చు.

దాదాపు పదివేల ఎకరాల్లో లక్షన్నర రెస్ట్ రూమ్‌లు, వేలాది వాష్‌రూమ్‌లు, అంబులెన్స్‌లు, వందలాది పడకలతో తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో ప్రత్యేక బస్సులు, వేలాది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఒక్క రైళ్ల ద్వారానే దాదాపు రెండు కోట్ల మంది వస్తారని రైల్వే శాఖ అంచనా. ఇక ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారి కోసం 5 లక్షల కార్ల పార్కింగ్‌కు సౌకర్యాలు కల్పించారు.

కాలుష్య నివారణ కోసం పెద్ద సంఖ్యలో విద్యుత్ వాహనాల వినియోగం, అతిపెద్ద నదీ శుద్ధి కార్యక్రమం, వేల సంఖ్యలో పారిశుద్ధి కార్మికులు.. ఇలా ఎన్నెన్నో  సదుపాయాలను కల్పించారు. మిగతా కుంభమేళాలకు భిన్నంగా 144 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ మహా కుంభమేళాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.

వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, నీటి అడుగునుంచే పర్యవేక్షించే నిఘా కెమెరాలు, పడవలపైనుంచి నిఘా లాంటి ఎన్నెన్నో ఆధునిక సాంకేతికతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పోలీసులతో పాటుగా వేల సంఖ్యలో పారా మిలిటరీ బలగాల సేవలను ఉపయోగించుకోనున్నారు. అందుబాటులో ఉన్న అన్ని సేవలను ఉపయోగించుకోవడం ద్వారా భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.

కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణ లక్షల సంఖ్యలో తరలివచ్చే సాధువులేనని చెప్పవచ్చు. హిమాలయాల్లో ఉండే నాగసాధువులతో పాటు వివిధ అఖారాలనుంచి లక్షల సంఖ్యలో సాధువులు ఈ మహా కుంభమేళాకు తరలి రానున్నారు. నాగసాధువులను దర్శించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భక్తులు ఎగబడతారు. మరోవైపు ఇన్ని కోట్లమంది భక్తులకు ఆహార, వసతుల కోసం వివిధ మఠాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ శక్తివంచన లేకుండా ఏర్పాట్లు చేశాయి.

అవసరమైన సమాచారాన్ని అందించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటుగా వందల సంఖ్యలో సమాచార కేంద్రాలు సిద్ధం చేసింది. రోజుకు కోటిమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవాల ప్రారంభం సందర్భంగా యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ చెప్పడం గమనార్హం.  ఇక తొలి రోజే కోటికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెప్తున్నారు.

మకర సంక్రాంతినాడు తొలి రాజస్నానం మొదలు కాగా , మహా శివరాత్రినాటి రాజస్నానంతో మేళా ముగుస్తుంది. మహాకుంభమేళా సందర్భంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన  ఆధ్యాత్మిక పండుగగా భావించే ఈ మహాకుంభమేళాలో స్నానమాచరిస్తే ఆత్మశుద్ధిని పొందడమే కాకుండా భగవంతుడికి చేరువవుతారన్నది హిందువుల బలమైన విశ్వాసం. అందుకే ఈ ఆధ్యాత్మిక జనసంద్రం.