ముంబై, సెప్టెంబర్ 6: నగదు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్ జెట్ ఈక్విటీ, వారెంట్ల జారీ ద్వారా రూ.3,200 కోట్ల నిధుల సమీకరించాలని నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్ల ప్లేస్‌మెంట్ (క్విప్)లో రూ.2,500 కోట్ల ఈక్విటీని, ప్రమోటర్లకు రూ.736 కోట్ల వారెంట్లను జారీచేసి మూలధనాన్ని సమీకరించనున్నట్టు స్పైస్ జెట్ శుక్రవారం ఇన్వెస్టర్లకు ఒక ప్రెజెంటేషన్‌లో తెలిపింది. అజయ్ సింగ్ ప్రమోట్ చేసిన స్పైస్ జెట్ ఈ ఏడాది జనవరిలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.1,060 కోట్లు సమీకరించింది.
తమ విమానాల సంఖ్య తగ్గడం, వర్కింగ్ క్యాపిటల్ అధికంకావడం,ఎయిర్‌పోర్టుల్లో అద్దె వ్యయాలు పెరగడం, బకాయిల ఎక్కువకావడం ప్రస్తుత సమస్యలకు కారణమని ఎయిర్‌లైన్ వివరించింది. తాము నడిపే విమానాల సంఖ్య 2019లో 74 ఉండగా, 2024లో 28కు తగ్గాయని, నిధుల కొరతతో 36 ఎయిర్‌క్రాఫ్ట్‌లు గ్రౌండ్‌లోనే ఉన్నాయని తెలిపింది. వివిధ సరఫరాదారులకు రూ.3,700 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని వెల్లడించింది.