calender_icon.png 19 January, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు

03-09-2024 12:13:25 AM

  1. వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలె
  2. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
  3. సిబ్బంది హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలె
  4. టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి):  రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినా, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి కరెంట్ సరఫరా చేశామని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. సోమవారం జిల్లాల/సర్కిళ్ల సీఈ, ఎస్‌ఈలతో  విద్యుత్ సరఫరా, తాజా పరిస్థితులపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈదురు గాలులకు భారీ వృక్షాలు, ఇతర వస్తువులు కరెంట్ తీగలపై పడటంతో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు.

స్తంభాలపై కూలిన చెట్లను తొలగించి కొత్త పోల్స్, లైన్‌లు ఏర్పాటు చేశామని, మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. వర్షం, వరదలను సైతం లెక్కచేయకుండా కరెంట్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్న అధికారులను, సిబ్బందిని సీఎండీ అభినందించారు. సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం జరిగిందన్నారు. దాదాపు 1,200 వందలకు పైగా విద్యుత్ స్తంభాలు, నాలుగు సబ్ స్టేషన్స్ దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా సంస్థ పరిధిలో 2,417 విద్యుత్ స్తంభాలు, 21 డీటీఆర్ స్ట్రక్చర్స్, 18 సబ్ స్టేషన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు.

వీటిలో గ్రేటర్ హైదరా బాద్ పరిధిలో 412 విద్యుత్ స్తంభాలు, 13 డీటీఆర్‌స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. మరికొన్ని రోజులు వర్షసూచనలు ఉన్నందున అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదేశించారు.  పునరుద్ధరణ పనులు చేసేటప్పుడు సిబ్బంది తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు.  క్షేత్రస్థాయిలో తగినంత మెన్, మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కొరత లేదు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ లో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు కొరతలేదని ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. మధురానగర్, లక్ష్మీనగర్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, గాలుల ఉధృతికి ౪ పెద్ద చెట్లు  విద్యుత్ స్తంభాలపై కూలిపోయాయని చె ప్పారు. దీంతో 8 స్తంభాలు ధ్వంసం అయ్యా యని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. వెంటనే ఏబీ కేబుల్ సమకూర్చుకుని, కూలిన చెట్ల కింద నుంచి నూతన లైన్‌వేసి రాత్రి ఒంటి గంట వరకు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు.

అనంతరం సోమవారం ఉదయం వరకు అన్ని లైన్ల డీటీఆర్‌లు తనిఖీ చేసి, (రెండు అపార్ట్మెంట్ లు తప్ప) సరఫరాను సాధారణ స్థితికి తెచ్చామన్నారు. ఇదే ప్రాంతంలో యూజీ కేబుల్ కు కనెక్ట్ అయి ఉన్న రెండు అపార్ట్మెంట్ (సుమారు 20 కుటుంబాలకు)ల దగ్గర వున్న పోల్స్ కూలిపోవడంతో సరఫరా పునురుద్ధరణ వీలు కాలేదని, మధ్యాన్నం నుంచి కొత్త పోల్స్ వేయడం జరుగుతున్నదని తెలిపారు.