- నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకులు బలి
- సిటీలో క్రమంగా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య
- గత పది నెలల్లో సుమారు 2,745 రోడ్డు ప్రమాదాలు
- గాయపడ్డ వారు 3,105.. ప్రాణాలు కోల్పోయింది 219 మంది
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): అతివేగం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. గమ్యం చేరే తొందరలో వేగంగా వాహనాలు నడుపుతూ కొందరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొందరు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నారు.
ఈ మధ్య కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను గమనిస్తే అందులో ఎక్కువగా ప్రభుత్వ(ఆర్టీసీ), ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మితిమీరిన వేగంతో బస్సులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి, జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల్లో మాత్రం అనుకున్న రీతిలో మార్పు రావడం లేదు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు పోల్చితే 2023లో 1,903 రోడ్డు ప్రమాదాలు, 2024(జనవరి నుంచి అక్టోబర్ వరకు)లో 2,745 ప్రమాదాలు జరిగాయని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాలలో 2023లో 1,916 మంది, 2024లో 3,105 మంది గాయపడ్డారు. అలాగే 2023లో 275 మంది, 2024లో 219 మంది ప్రాణాలు కోల్పోయారు.
గతేడాదితో పోల్చితే మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరిగిందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఇవి కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత పది నెలల్లో జరిగిన ప్రమాదాల వివరాలు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రమాదాలు వీటికి అదనం.
ర్యాష్ డ్రైవింగ్..
పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా నగరంలో వాహనాల సంఖ్య రెట్టింపవుతోంది. కొందరు వాహనదారులు మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్‌తో వాహనాలను రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వీటితో పాటు నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులు పెరిగిపోయారు.
రాంగ్‌సైడ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ టేక్, హెల్మెట్ లేని ప్రయాణాలు, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నారు. వీరి మూలంగా ప్రతి ఏటా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు మద్యం మత్తులో అర్ధరాత్రుళ్లు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
చలాన్లకే పరిమితం
సిటీ రోడ్లపై లక్షలాది వాహనాలు తిరుగుతుంటే వాటిని కంట్రోల్ చేసే ట్రాఫిక్ సిబ్బంది మాత్రం వేలల్లోనే ఉన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో కాకుండా కేవలం సిగ్నల్స్ ఆపరేటింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనదారుల ఫొటోలు తీయడానికే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ట్రాఫిక్ చలాన్లు విధించినా కూడా వాహనదారుల్లో మాత్రం మార్పు కనబడడం లేదనే చెప్పాలి. ప్రతి ఏడాది చివర్లో ట్రాఫిక్ చలాన్ల వసూలుకు ప్రభుత్వం వాటిపై భారీ రాయితీ కల్పించడం కూడా వాహనదారుల్లో భయం లేకుండా పోతోందని తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినా కొద్ది మొత్తం జరిమానా కడితే సరిపోతుందనే ధీమాతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్యన జరిగిన ప్రమాదాలు
1. ఆదివారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్ వద్ద అతివేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి బైక్‌ను ఢీకొట్టడంతో బ్రహ్మయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
2. ఓం సాయి కాలనీకి చెందిన కృష్ణారెడ్డి (24) లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు. శనివారం తెల్లవారుజామున స్నేహితుడి ని కలవడానికి బైక్‌పై అల్వాల్ వైపు బయలుదేరాడు. వెన్నలగడ్డ పోచమ్మ టెంపుల్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడం తో అక్కడికక్కడే మృతిచెందాడు.
3. ఉప్పల్ ఆదర్శనగర్‌కు చెందిన రోహిత (25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శనివారం ఉదయం స్కూటీపై మెట్టుగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా.. తార్నాక ఫ్లు ఓవర్ సమీపంలో రిలయన్స్ మార్ట్ వద్ద కోఠి నుంచి కుషాయిగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పి కిందపడిపోయిన రోహితపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది.