calender_icon.png 26 October, 2024 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంతనలేని మాటలేల?

26-10-2024 02:14:14 AM

  1. రికార్డులు లేకుండా సమాధానాలు చెప్తే చర్యలు తీసుకుంటా 
  2. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం
  3. కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు రెండవ రోజు హాజరు
  4. మూడు బరాజ్‌లలో 2019 నుంచే సమస్యలు
  5. కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడం వల్లే ఎత్తు పెంచాల్సి వచ్చింది 
  6. డిజైన్ల ఖరారు ఆలస్యం, మార్పుల కారణంగా అంచనా వ్యయం పెరిగింది
  7. ప్రాణహిత చేవెళ్ల పనుల్లో రూ. 750 కోట్ల పనులు వృథాగా పోయాయి 
  8. స్థానిక సమస్యలు, భూసేకరణ లేటవ్వడంతో పనులు ఆలస్యం
  9. కమిషన్‌కు చెప్పిన మాజీ ఈఎన్సీ 
  10. కాళేశ్వరం సీఈ కోరిన మేరకు డిజైన్లు మార్చినట్లు అంగీకరించిన సీడీఓ సీఈ చంద్రశేఖర్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో 2019 నుంచే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిపై నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ జనరల్ సమావేశాలు కూడా నిర్వహించారని రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు జస్టిస్ ఘోష్ కమిషన్‌కు తెలిపారు.

ఆయన రెండో రోజు కూడా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా 3 బరాజ్‌లపై పలు ఆయనను కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. 62 ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కొన్నింటికి సంబంధించిన ఆధారాలను, రికార్డులను సోమవారం కమిషన్‌కు అందిస్తామని తెలిపారు.

కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందన్న వెంకటేశ్వర్లు డిజైన్ల తయారీలో ఆలస్యం జరిగిందని చెప్పారు. అఫిడవిట్లో ఇచ్చిన సమాచారానికి, చెప్తున్న సమాధానాలకు పొంతన లేదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరో చెబితే వారిని సంతృప్తి పరిచేందుకు పనులు చేశారని, వేరే వాళ్లు చేసిన తప్పులు మీ మీద వేసుకునే ప్రయత్నం చేయవద్దని కమిషన్ వెంకటేశ్వర్లుకు సూచించింది.

సాధారణం అంటూ సమాధానాలు ఇవ్వొద్దని మూడు బరాజ్‌లపై స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలని ఘోష్ కోరారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, వాటికి ఆధారాలను సోమవారం సమర్పిస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకు కమిషన్ అనుమతి ఇచ్చింది.

కమిషన్: మూడు బరాజ్‌లను ఎప్పుడు ప్రారంభించారు? డ్రాయింగ్స్ ఆలస్యంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారా...

వెంకటేశ్వర్లు జవాబు: వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్‌కు సోమ వారం నాడు అందచేస్తాను. డ్రాయింగ్స్ ఆలస్యంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. అత్యవసరం కాబట్టే డ్రాయింగ్స్ ఆలస్యమైనా పనులు చేయాలని చెప్పాం.

కమిషన్: మూడు బరాజ్‌లు సవరించిన అంచనాలు ఎంత? ఎందుకు సవరించారు?

జవాబు: మేడిగడ్డ రూ. 2591 కోట్లు అయితే రూ. 4613 కోట్లకు, అన్నారం రూ. 1785 కోట్లు అయితే రూ. 2700 కోట్లు, సుందిళ్ల రూ. 1437 కోట్లు అయితే రూ.2300 కోట్లుగా రివైజ్ అయ్యింది. డిజైన్స్, డ్రాయింగ్స్‌ఆలస్యంతో పాటు సవరించిన పనుల కారణంగా అంచనాలు పెరిగాయి. ఆయకట్టును పెంచేందుకు కూడా అంచనాలను సవరించాల్సి వచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆమోదించారు. 

కమిషన్: కాళేశ్వరానికి ముందు ప్రాణహిత చేవెళ్ల కోసం రూ.14వేల కోట్లకు పైగా చేసిన పనులు ఏమయ్యాయి...

జవాబు: ప్రాణిహిత చేవెళ్ల పనుల్లో రూ.750 కోట్ల విలువైన పనులు ఫలితం లేకుండా పోయాయి. 

కమిషన్: పూర్తి అయినట్లుగా సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? 

జవాబు: మేడిగడ్డ విషయంలో సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్, మిగతా రెండు బ్యారేజీలకు పూర్తి సర్టిఫికెట్ ఇచ్చాం.  స్థానిక అంశాలు, భూసేకరణ వల్లే బ్యారేజీల పను ల్లో ఆలస్యం అయింది. పనులు ఆలస్యం అవుతున్నప్పుడు గుత్తేదారుకు కేవలం మౌఖిక ఆదేశాలు ఇచ్చాం. అత్యవసరం కాబట్టే డ్రాయింగ్స్ ఆలస్యమైనా పనులు చేయాలని చెప్పాం.

కమిషన్: మూడు బరాజ్‌లకు సంబంధించిన బ్యాంకు గ్యారెంటీలను పూర్తిగా విడుదల చేశారా?

జవాబు: కొవిడ్ సమయంలో ప్రభుత్వం నిబంధనలకు మినహాయింపు ఇవ్వడంతో బ్యాంకు గ్యారంటీల్లో సగానికి పైగా వెనక్కి ఇచ్చాం. 

కమిషన్: కాళేశ్వరం నోడల్ ఆఫీసర్ ఎవరు... ఆయన విధులేంటి?

జవాబు: కాశేశ్వరం నోడల్ ఆఫీసర్‌గా బీ హరిరాం ఉన్నారు. ప్రాజెక్టు సీఈలతో సమన్వయంతో పాటు డీపీఆర్ అనుమతులు, ఓవరాల్ నివేదికలపై ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

సీఈ చెప్తేనే: సీడీఓ సీఈ చంద్రశేఖర్

కాలేశ్వరం కమిషన్ ముందు హాజరైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ 62 ప్రశన్లకు సమాధానం ఇచ్చారు. 3 బరాజ్‌లకు సంబంధించిన డిజైన్స్ మరియు డ్రాయింగ్స్ అంశాలలో కమిషన్ ఆయనకు పలు ప్రశ్నలను సంంధించింది. కాళేశ్వరం సీఈ చెప్పిన ప్రకారం డిజైన్లలో మార్పులు చేసినట్లు చంద్రశేఖర్ ఒప్పుకున్నారు. తాము ఇచ్చిన డిజైన్లను మార్చినట్లుగా ఆయన అంగీకరించడం విశేషం.

కమిషన్: సీఈ కాలేశ్వరం డిజైన్స్, డ్రాయింగ్స్‌ను మోడిఫై చేయమన్నారా? - 

చంద్రశేఖర్ జవాబు: సైట్ కండిషన్స్ ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్‌లో మార్పులు చేయమని కాలేశ్వరం సీఈ అడిగారు. అందుకే మార్పులు, చేర్పులు చేశాం.

కమిషన్: డిజైన్లు డ్రాయింగ్స్ వేసి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకున్నారా, డిజైన్లు సరిగ్గా లేవని డిపార్ట్‌మెంట్‌పై ఆరోపణలు ఉన్నాయి.. మీరు దానికి అంగీకరిస్తారా, డిజైన్లు సరిగా లేకపోవడం వల్లనే 7వ బ్లాక్ పిల్లర్లు కుంగాయి అనే ప్రశ్నకు సమాధానం ఏంటి?

జవాబు: అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డిజైన్లు తయారు చేశాం. పిల్లర్ల డ్యామేజీకి డిజైన్లకి సంబంధం లేదు. 

కమిషన్: డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ సీబీఐపీ మాన్యువల్ ప్రయారిటీ తీసుకున్నారా? 

జవాబు: డిజైన్స్, డ్రాయింగ్ అంశంలో సీడబ్ల్యూసీ ఐఎస్ కోడ్ నిబంధనలను పాటించాం. 

కమిషన్: మేడిగడ్డ నిర్మాణంలో సీకెంట్ పైల్స్ ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది?

జవాబు: ప్రాజెక్టులో బోర్ హోల్స్ వేసిన తర్వాత ఇసుక, సాండ్ స్టోన్స్ గుర్తించాం. ఫీల్డ్ ఇంజినీర్లు ఇది అధ్యయనం చేసి సాండ్ స్టోన్‌లో పనుల విషయం కష్టంగా ఉంటుందని నివేదించారు. అందుకే సీకెంట్ పైల్స్‌కు మొగ్గుచూపాం.

కమిషన్: ప్రాజెక్టు డిపిఆర్‌లో బ్యారేజీల వద్ద నీళ్లు స్టోరేజీ చేయొచ్చు అనే అంశం ఉన్నదా? 

జవాబు: ప్రత్యేకంగా లేదు కానీ ఎంఎఫ్డీలో మెన్షన్ చేశారు. స్ట్రక్చర్స్, పాండ్ లెవల్స్, గరిష్ఠ నీటి నిల్వ, వందేళ్ల ఫ్లడ్ డిశ్చార్జ్ ఆధారంగా నీటి నిల్వ చేశాం. 

కమిషన్: మేడిగడ్డ డిజైన్స్ ఏ ప్రమాణాల మేరకు అప్రూవ్‌చేశారు. డిజైన్స్‌ను ఇవ్వడంలో మీ శాఖ ఏదైనా ఆలస్యం చేసిందా?

జవాబు: జీఏ డ్రాయింగ్స్ మోడల్ స్టడీస్ తర్వాత అప్రూవ్ చేశాం. డిజైన్స్ ఇవ్వడంలో ఆలస్యంపై నాకు సరిగ్గా గుర్తు లేదు.

కమిషన్: మీరు పంపించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను కాళేశ్వరం సీఈ సరిగ్గా అధ్యయనం చేసి సమీక్షించారా?

జవాబు: ఆ అంశం నాకు తెలియదు. 

కమిషన్: కాఫర్ డ్యాం శాశ్వత నిర్మాణమా... తాత్కాలికమా...

జవాబు: తాత్కాలిక నిర్మాణం మాత్రమే.