calender_icon.png 26 December, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీలలో స్పెషాలిటీ వైద్యం

16-09-2024 04:06:49 AM

  1. తొలుత గ్రామాల్లో.. తదుపరి పట్టణాల్లో
  2. కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
  3. రాష్ట్రంలో దాదాపు 882 పీహెచ్‌సీలు
  4. గ్రామీణులకు సైతం స్పెషాలిటీ వైద్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇవే ప్రత్యే క వైద్య సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) మాత్రం ఇన్నాళ్లుగా అందుబాటులో లేవు. అయితే పీహెచ్‌సీలలో కూడా స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పీహెచ్‌సీల్లో కేవలం ఎంబీబీఎస్ చదివిన వైద్యులు మాత్రమే సాధారణ వైద్య సేవలు అందిస్తారు. కనీసం గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యులు కూడా ఉండరు. ఈ నేపథ్యంలో స్పెషాలిటీ వైద్యుల నియామకం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు సిద్ధం అవ్వడం గ్రామీణులకు వరంగా మారనుంది.

స్పెషాలిటీ వైద్యంతో అధిక భారం.. 

సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, వాంతు లు, విరేచనాలు మొదలైన వైద్య సేవలకు పీహెచ్‌సీలలో అందుబాటులో ఉండే మెడికల్ ఆఫీసర్లు వైద్యం అందిస్తారు. కానీ గైనకాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఆర్థో, పల్మనాలజీ, ఈఎన్టీ, ఆప్తల్మాలజీ, డెంటల్  తదితర వైద్య సేవల కోసం పేద ప్రజలపై భారం పడుతోంది. అదీగాక ఈ వైద్యం కోసం దగ్గర్లో ఉన్న పట్టణం లేదా నగరానికి వెళ్లాల్సి వస్తోంది. వైద్యులకు ఓపీ కోసమే రూ. 400 నుంచి రూ.1000 వరకు ఉంటోంది. దీనికి తోడు వైద్య పరీక్షలు, మందులు అన్నీ కలిపి ఓ సాధారణ రోగి నుంచి ప్రైవేటులో రూ. 1500 నుంచి రూ. 5000 వరకు వసూలు చేస్తున్నారు.

ఆయా దవాఖానల స్థాయిని బట్టి ఇది కొన్ని చోట్ల భారీగా ఉంటున్నది. రోగి దొరికితే చాలు పిండుకుందామనుకున్న తీరుగా ఉన్న కొన్ని ప్రైవేటు దవాఖానలు భారీగా వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యం కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఖర్చులను భరించే పరిస్థితి లేకుండా పోయింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం పీహెచ్‌సీలలో కూడా ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించడంతో గ్రామీణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

స్పెషాలిటీ వైద్యుల నియామకం కోసం కసరత్తు..

ప్రత్యేక సేవలు అధిక ఖర్చుతో కూడుకుని ఉండటంతో పాటు పేద రోగులకు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం ప్రతి వారం రొటేషన్ పద్ధతిలో ప్రాథమికఆరోగ్యకేంద్రాల్లో స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. గైనకాలజిస్టులు, పీడియాట్రిషిషన్లు, కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు సహా ఇతర స్పెషాలిటీ వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 636, పట్టణ ప్రాంతాల్లో 246 పీహెచ్‌సీలున్నాయి.

తొలి దశలో గ్రామీణ ప్రాంత పీహెచ్‌సీలలో స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలలోనూ ఈ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకువస్తా రు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో దశలవారీగా పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా స్పెషాలిటీ వైద్యులను తయారు చేయ డంలో రాష్ట్రంలో కొరత ఉండబోదని. ఇది తెలంగాణలో వైద్య రంగానికి ఎంతో ప్రయోజ నం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. 

ఒక్కో రోజు ఒక్కో స్పెషాలిటీ..

పీహెచ్‌సీలలో ప్రారంభించబోయే ప్రత్యేక వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉండవు. ఒక్కో స్పెషాలిటీ ఒక్కో రోజు లేదా అంతకంటే ఒక రోజు అదనంగా అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు సోమవారం గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు అందుబాటులో ఉంటే.. మంగళవారం ఆర్థోపెడిక్స్, బుధవారం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అందుబాటులో ఉంటారు. గురువారం పీడియాట్రిషియన్, శుక్రవారం పల్మనాలజిస్ట్, శనివారం కార్డియాలజిస్ట్ అందు బాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తారు.

ఒక్కో వారం ఒక్కో స్పెషాలిటీ వైద్యుడు అందుబాటులో ఉంటా రనే విషయాన్ని ఆయా పీహెచ్‌సీలలో నోటీస్ బోర్డుల్లో ఉంచుతారు. స్పెషాలిటీ వైద్య సేవలకు తగినట్లుగా ఆరోగ్య పరీక్షలను చేసేందుకు సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక పీహెచ్ సీలలో అందుబాటులో లేని వైద్యసేవల కోసం రోగులను ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు.