calender_icon.png 24 October, 2024 | 7:49 PM

మహాగణపతి నిమజ్జనానికి ప్రత్యేక వాహనం

17-09-2024 03:37:04 AM

విజయవాడ నుంచి టస్కర్‌ను తెప్పించిన నిర్వాహకులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు గల మహాగణపతి బరువు దాదాపు 70 టన్నులు. మహాగణపతిని నిమజ్జనానికి తరలించేందుకు ఆదివారం సాయంత్రమే విజయవాడకు నుంచి ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఈడీఎస్ అనే భారీ టస్కర్ వాహనాన్ని ఉత్సవ కమిటీ వారు తెప్పించారు. 26 టైర్లు గల ఈ వాహనం పొడవు 75 అడుగులు, వెడల్పు 11 అడుగులు కాగా 100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే, ఈ మహాగణపతిని నిమజ్జనానికి తరలించేందుకు 20వ సారి ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. శోభాయాత్ర కోసం ఆ వాహనానికి ప్రత్యేకంగా వెల్డింగ్ చేసి బేస్ ఏర్పాటు చేశారు. 

భారీ క్రేన్‌తో వాహనం పైకి..

నేడు తెల్లవారుజామున ఖైరతాబాద్ భారీ గణేశుడిని ఎస్‌టీసీ కంపెనీకి చెందిన భారీ క్రేన్‌తో ప్రత్యేక వాహనంపైకి ఎక్కించనున్నారు. ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర వాహన డ్రైవర్‌గా నాగర్‌కర్నూల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. పదిహేనేళ్లుగా ఆయనే వాహనాన్ని నడుపుతున్నాడు. ఖైరతాబాద్, లక్డీకపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది. మధ్యాహ్నం ఒకటిన్నరలోపు నిమజ్జనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4వద్ద గల సూపర్ క్రేన్‌తో ఈ మహాగణపతిని నిమజ్జనం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

హుండీ ఆదాయం రూ.70 లక్షలు..

ఖైరతాబాద్ బడా గణేశుడి హుండీని సోమవారం నిర్వాహకులు లెక్కించారు. పది రోజులుగా దర్శించుకున్న భక్తులు నగదు రూపంలో కానుకలు సమర్పించడంతో దాదాపు రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. హోర్డింగ్‌ల రూపంలో మరో రూ.40 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు.